న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కుతున్న వేళ, ఒక ప్రాథమిక ప్రశ్న ముందుకొస్తోంది. భారత ప్రజాస్వామ్యానికి నిజంగా ఎక్కువ మంది ఎంపీలు అవసరమా, లేక ఉన్నవారితోనే సమర్థవంతంగా పనిచేసే పార్లమెంటు కావాలా? ప్రజాస్వామ్య విజయానికి కొలమానం సభ్యుల సంఖ్య కాదు… వారి పనితీరు. తక్కువ సమయంలోనే కీలక చర్చలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే పార్లమెంటు కోసం నేడు దేశం ఎదురుచూస్తోంది.
కాగా, డీలిమిటేషన్‌తో ముడిపడిన మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశంగా తిరిగి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లోక్‌సభలోని 543 మందిలో 469 మంది పురుషులు, 74 మంది (14%లోపు) మహిళలు ఉన్నారు. 33% రిజర్వేషన్ ఇస్తే పురుషులకు 362 సీట్లే మిగులుతాయి. సీట్లు 850కి పెంచితే పురుషులకు 566 సీట్లు అందుబాటులోకి వస్తాయి. పదవిలో ఉన్న పురుష నేతల అసంతృప్తిని తగ్గించడానికే డీలిమిటేషన్‌ను రిజర్వేషన్‌తో కలిపారన్న విశ్లేషణ బలంగా ఉంది.
కానీ, జనాభా పెరిగినంత మాత్రాన ఎంపీల సంఖ్య పెంచాలా? నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 10 లక్షల నుంచి 25–30 లక్షలకు పెరిగినా, నేడు సోషల్ మీడియా, వీడియో కాన్ఫరెన్సింగ్, నియోజకవర్గ కార్యాలయాల ద్వారా ప్రజలతో నిరంతరం సంప్రదింపులు సాధ్యమే. స్థానిక సమస్యలకు పంచాయతీ/మున్సిపాలిటీలు, రాష్ట్ర స్థాయి సమస్యలకు ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తారు. ఎంపీ పాత్ర జాతీయ స్థాయిలో నిధులు, విధానాలపై ప్రశ్నించడం వరకే పరిమితం. అందుకు కావాల్సింది సంఖ్య కాదు; అవగాహన, స్పష్టత కలిగిన ప్రతినిధులు. పైగా, ఎక్కువ మంది ఎంపీలు ఉంటే సభలో మాట్లాడే సమయం తగ్గి, నిర్వహణ మరింత క్లిష్టమవుతుంది.
మరోవైపు, కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణ రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న ఆందోళనను ఏప్రిల్ 2026 చర్చలో హోం మంత్రి అమిత్ షా ప్రస్తావిస్తూ, ప్రతి రాష్ట్రంలోనూ ఎంపీల సంఖ్య సుమారు 50% పెరుగుతుందని హామీ ఇచ్చారు. బిల్లు వీగిపోవడంతో అది ప్రకటనగానే నిలిచింది. ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీల సంఖ్య పెరగడం వల్ల జీతాలు, భత్యాలు, భద్రత, మౌలిక సదుపాయాల రూపంలో పన్ను చెల్లింపుదారులపై భారీ భారం పడుతుంది.
అన్నిటికంటే ముఖ్యంగా, ఉత్పాదకత ప్రశ్న తలెత్తుతోంది. పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రకారం, 2026 వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ కేవలం 15 శాతం, రాజ్యసభ 33 శాతం సమయమే పనిచేశాయి. సభలో నినాదాలు, ప్లకార్డులు, వాకౌట్‌లు, హడావుడిగా బిల్లుల ఆమోదం నిత్యకృత్యంగా మారాయి. ప్రశ్నోత్తరాల సమయం వాయిదా పడుతోంది. ఉన్న 543 మంది సభ్యులే కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనప్పుడు, మరో రెండు వందల మందిని చేరిస్తే గందరగోళం మరింత పెరుగుతుందన్న ఆందోళనలు లేకపోలేదు.
ప్రభుత్వం, ప్రతిపక్షం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై స్పష్టత ఇస్తూనే, శాసన ప్రక్రియలో ఉభయపక్షాలూ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్రజలు వెచ్చించే ప్రజాధనానికి తగిన న్యాయం జరగాలని విశ్లేషకులు అంటున్నారు. భారత్‌కు కావాల్సింది 543, 785 లేదా 850 మంది ఎంపీలు కాదు—నిర్ణీత సమయంలో సమర్థవంతంగా పనిచేసే సమర్థవంతమైన పార్లమెంటు, తద్వారా ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసం పునరుద్ధరించేలా చేయాలని విశ్లేషకులు సెలవిస్తున్నారు.
