ఇంఫాల్/న్యూఢిల్లీ: మణిపూర్‌లోని 40 ఇంపాల్ లోయ అసెంబ్లీ స్థానాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలని, ఆ స్థానాలను స్థానిక ప్రజల కోసం ప్రత్యేకంగా కేటాయించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఇమో సింగ్ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారు. “…కొండ ప్రాంతాలకు ఇప్పటికే పలు సీట్లు రిజర్వ్ చేసారు. జనసాంద్రత అసమతుల్యతను నివారించడానికి, ఈ ప్రాంత సామాజిక-సాంస్కృతిక గుర్తింపును కాపాడటానికి ఈ డిమాండ్ ముందుకు తెచ్చానని ఆయన అన్నారు. లోయలోని ఆదివాసీ ప్రజల కోసం ఉద్దేశించిన 40 సీట్లకు రాజ్యాంగ రక్షణ కల్పించే ఈ చర్య అత్యవసరం,” అని ఇమో సింగ్ అన్నారు. ఈ స్థానాలను ప్రస్తుతం ఓపెన్ సీట్లుగా వర్గీకరించారు.
అంతేకాదు ఏప్రిల్ 7న జరిగిన బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటనపై ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. జాతి హింస నుంచి కోలుకుంటున్న, మయన్మార్ సరిహద్దు రాష్ట్రంలో జాతీయ జనాభా గణనకు ముందు తీసుకోవాల్సిన కొన్ని చర్యలను కూడా ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఇమో సింగ్ తన లేఖలో సూచించారు.
రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిష్ణుపూర్ జిల్లాలోని ట్రోంగ్లాబి గ్రామంలో, రాత్రిపూట తమ ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడు, అతని ఐదు నెలల పసికందు అయిన చెల్లి ఈ బాంబు దాడిలో మరణించారు.
రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లోయలోని సగోల్‌బంద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇమో సింగ్, రెండు పేజీల లేఖలో, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇప్పటికే ఈ కేసును చేపట్టిందని, మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా ఉగ్రవాద సంస్థలపై సమగ్ర ఉక్కు చర్యలు ప్రారంభించడమే తదుపరి చేయాల్సిన పని అని పేర్కొన్నారు.
“ఈ విషయంలో సకాలంలో చర్యలు తీసుకోవడం ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడమే కాకుండా, ఈ ప్రాంతంలో చట్టబద్ధమైన పాలనను కూడా బలోపేతం చేస్తుందని” ఇమో సింగ్ అన్నారు.
దాదాపు మూడేళ్ల క్రితం చెలరేగిన జాతి హింస అనంతర పరిస్థితిని ప్రస్తావిస్తూ, వరుస దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే జాతీయ జనాభా లెక్కలలోని మణిపూర్ భాగం తప్పుగా ఉండే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. డేటాను సేకరించే ముందు అంతర్గతంగా నిరాశ్రయులైన ప్రజలందరూ మొదట తమ ఇళ్లకు తిరిగి వచ్చేలా చూడటం కూడా ఈ చర్యలలో భాగమని ఆయన తెలిపారు.
“రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘర్షణల కారణంగా, వేలాది మంది నిరాశ్రయులై సహాయ శిబిరాల్లో నివసిస్తున్నందున, ఇళ్ల జాబితాను కచ్చితంగా రూపొందించడం అత్యంత కష్టమవుతుంది. అందువల్ల, సహాయ శిబిరాల్లో ఉంటున్న వారిని వారి అసలు ఇళ్లకు సక్రమంగా తరలించిన తర్వాతే జనగణన నిర్వహించడం సముచితమని” ఇమో సింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
మణిపూర్‌లోని జనాభా, ప్రాతినిధ్యానికి సంబంధించిన సమస్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేయడం ఇది మొదటిసారి కాదు. ఏప్రిల్ 13 నాటి లేఖలో, సరిహద్దు రాష్ట్రానికి సంబంధించి కేంద్రం పరిగణనలోకి తీసుకోవాల్సిన మూడు అంశాలను ఆయన ప్రస్తావించారు: జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి) నిర్వహించడం, అక్రమ వలసదారులను, నకిలీ ఓటర్లను పట్టుకోవడం, ’40 లోయ స్థానాల్లో’ స్థానిక వర్గాలకు రాజ్యాంగ రక్షణ కల్పించడం వంటి చర్యలను ఆయన సూచించారు.
అక్రమ వలసదారులను పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందిస్తూనే, “బూటకపు లేదా నకిలీ ఓటర్ల చేరిక వల్ల ఏర్పడిన వ్యత్యాసాలను” తొలగించడానికి మణిపూర్ ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలని ఇమో సింగ్ అభ్యర్థించారు.
“… ఓటర్ల జాబితాలోని అవకతవకలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి, నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభమయ్యేలోపు వాటిని తక్షణమే సరిదిద్దాలి,” అని ఆయన అన్నారు. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న ఎన్నికల సంఘం (ఈసీ) చొరవపై ఇమో సింగ్ మాట్లాడుతూ, ఎలాంటి అనుసంధానం చేసే ముందైనా మణిపూర్ ముందుగా నకిలీ ఆధార్‌లను తనిఖీ చేసి తొలగించాలని అన్నారు.
“గమనించదగ్గ విషయం ఏమిటంటే, అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరెన్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 65,000 నకిలీ ఆధార్ కార్డులను కనుగొంది. ఈ ఆందోళనకరమైన విషయం మన రాష్ట్రంలోని స్థానిక ప్రజల హక్కులు, గుర్తింపునకు ఉన్న తీవ్రమైన ముప్పును ఎత్తి చూపుతోంది. పారదర్శకమైన వ్యవస్థ కోసం కచ్చితమైన అనుసంధానానికి హామీ ఇవ్వడానికి ఈ సమస్యను పరిష్కరించడం కేవలం అవసరమే కాదు, అత్యవసరం,””మాజీ ముఖ్యమంత్రికి అల్లుడు కూడా అయిన ఆ బీజేపీ ఎమ్మెల్యే అమిత్‌షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.


