Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఇంధన వినియోగం, విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లు తగ్గించండి…ప్రధాని మోదీ పిలుపు!

Share It:

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన ఆరు రోజుల తర్వాత…నిన్న సికింద్రాబాద్‌లో జరిగిన ఒక సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, ఇది భారతదేశానికి ఒక “సంక్షోభ సమయం” అని తెలిపారు. ఈ నేపథ్యంలో మన కర్తవ్యాలను దృష్టిలో ఉంచుకుని మనం కొన్ని త్యాగాలు చేయాల్సిన” తరుణం ఆసన్నమైందని అన్నారు.

ముఖ్యంగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని, విచక్షణారహిత దిగుమతులను నివారించాలని, మరింత “ఆత్మనిర్భర” అలవాట్లను అలవర్చుకోవాలని మోదీ పౌరులను కోరారు. ఈ క్లిష్ట సమయంలో విదేశీ మారక నిల్వలను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా నొక్కి చెప్పారు. వీటిని మనం “సంపూర్ణ నిబద్ధతతో” నెరవేర్చాలని ఆయన అన్నారు.

“మీరు ప్రపంచవ్యాప్తంగా సవాళ్లను చూస్తున్నారు. పశ్చిమ ఆసియాలో సంక్షోభం కొనసాగుతోంది, యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి వల్ల భారత్ కూడా ప్రభావితమైందని” ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 2021 నాటి గరిష్ట స్థాయిల కంటే చాలా తక్కువగా, సుమారు 690 బిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 బిలియన్ డాలర్లు, ఆపై మరో 7.7 బిలియన్ డాలర్ల మేర రెండు ప్రధాన పతనాలను చవిచూశాయి.

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ప్రతి పౌరుడు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దేశ ప్రజలు కొన్ని త్యాగాలు చేయాలని కోరారు. ఇంధనాన్ని పొదుపు చేయడం, ప్రజా రవాణాను ఉపయోగించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తిరిగి ప్రారంభించడం, అనవసర వస్తువుల కొనుగోళ్లు, విదేశీ పర్యటనలు మానుకోవడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏడాది పాటు బంగారం కొనుగోళ్ల జోలికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

అంతర్జాతీయ ఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్‌లో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవాళ్లను భారత్ సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజలందరి సమష్టి భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. కష్ట సమయాల్లో దేశం కోసం బాధ్యతాయుతంగా జీవించడం, మన కర్తవ్యాలను నెరవేర్చడం కూడా దేశభక్తేనని ఆయన అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేయడమే కాదు, దేశం కోసం జీవించడం కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు.

“ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంపై మనం ప్రత్యేక దృష్టి పెట్టాలి. మనమందరం కలిసికట్టుగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి” అని మోదీ పిలుపునిచ్చారు. ఇంధన వినియోగాన్ని తగ్గిచడం, ప్రజా రావాణాను ఉపయోగించడం, ఇంటి నుంచి పని చేసే విధానాలు, సహజ వ్యవసాయం, స్వదేశీ ఉత్పత్తులకు మద్దతు వంటి చర్యలతో పాటు ఆర్థిక దేశభక్తిని ప్రోత్సహించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ ఈ విజ్ఞప్తి చేశారు.

కాగా, ప్రధానమంత్రి ప్రసంగంపై కాంగ్రెస్‌ తీవ్రంగా విరుచుకుపడింది. పశ్చిమ ఆసియాలో యుద్ధం మొదలై మూడు నెలలు గడిచినా, ఇంధన భద్రతను ఎలా నిర్ధారించాలనే దానిపై ఆయనకు “ఏమీ తెలియదని” కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.