Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఉపాధ్యాయ నియామకాల జ్యాప్యంపై పాట్నాలో నిరసన…ఐదువేలమందిపై ఎఫ్‌ఐఆర్‌!

Share It:

పాట్నా: బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ జారీలో జాప్యానికి నిరసనగా పాట్నాలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో…సుమారు 5,000 మంది అభ్యర్థులపై బీహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొన్న BPSC కార్యాలయం సమీపంలో జరిగిన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో, విద్యార్థి నాయకుడు దిలీప్ కుమార్‌తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

నిరసనకారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని, బారికేడ్లను దాటారని, ప్రజాశాంతికి భంగం కలిగించారని, సంఘటనా స్థలంలో మోహరించిన పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఒక మేజిస్ట్రేట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో ఈ FIR నమోదు చేశారు.

TRE-4 నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఉపాధ్యాయ నియామక అభ్యర్థులు పాట్నా కళాశాల నుండి BPSC కార్యాలయం వైపు కవాతు చేయడంతో ఈ నిరసన ప్రారంభమైంది. ఊరేగింపును అడ్డుకోవడానికి పోలీసులు జేపీ గోలంబర్ సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

నిరసనకారుల కథనం ప్రకారం, అభ్యర్థులను లోనికి వెళ్లకుండా దాదాపు రెండు గంటలపాటు నిలిపివేశారు. ఆ తర్వాత కొందరు ప్రదర్శనకారులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అనంతరం పోలీసులు గుంపును చెదరగొట్టడానికి లాఠీచార్జితో సహా బలప్రయోగం చేశారు. ఈ చర్యలో మహిళా అభ్యర్థులతో సహా పలువురు ఆశావహులు గాయపడినట్లు సమాచారం.

శనివారం, దిలీప్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల కోసం గార్డెనిబాగ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచిన తర్వాత, మరో ముగ్గురు ఆశావహులతో పాటు అతడిని బేయూర్ జైలుకు పంపారు.

పోలీసుల రక్షణలో ఉన్నప్పుడు కుమార్ విలేకరులతో మాట్లాడుతూ… “విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. మేము ఖాళీలు భర్తీచేయమని అడుగుతున్నాము, కానీ మమ్మల్ని జైలుకు పంపుతున్నారని” అన్నారు.

ప్రదర్శన సమయంలో కొందరు నిరసనకారులు దూకుడుగా ప్రవర్తించి బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులతో ఘర్షణకు దారితీసిందని పాట్నా సిటీ ఎస్పీ (సెంట్రల్) దీక్ష తెలిపారు.

“ఈ ఘటనలో తోపులాట, స్వల్ప లాఠీచార్జి జరిగాయి. కొంతమంది పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు,” అని ఆ అధికారి తెలిపారు. బారికేడ్ల ధ్వంసం, పోలీసు సిబ్బందితో ఘర్షణలపై కూడా వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.

ఇదిలా ఉండగా, కొత్తగా నియమితులైన బీహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ, TRE-4 నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందని అంగీకరిస్తూ, అభ్యర్థులు ఓపికగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాబోయే ఉపాధ్యాయులు వీధుల్లో ఉండటం, పోలీసులు వారిని తరుమడం చూడటం నాకు చాలా బాధ కలిగిస్తోంది,” అని తివారీ అన్నారు.

ఆశావహులను “మన కుటుంబ సభ్యులు”గా అభివర్ణించిన మంత్రి, వారి డిమాండ్లపై విద్యార్థులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నియామక ప్రక్రియను త్వరలోనే ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రం భావిస్తున్నట్లు కూడా ఆయన సూచించారు.

గత రెండేళ్లలో, బీహార్ TRE-1, TRE-2, TRE-3 ద్వారా సుమారు 2.27 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించగా, దాదాపు 3 లక్షల మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు సామర్థ్య పరీక్షలలో ఉత్తీర్ణులై రాష్ట్ర ఉద్యోగ హోదాను పొందారని సమాచారం.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.