Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

పాలస్తీనా పిల్లలపై “జినోసైడ్‌”…నివేదికను విడుదల చేసిన ఐక్యరాజ్యసమితి!

Share It:

న్యూఢిల్లీ: ఆక్రమిత పాలస్తీనా భూభాగం, ఇజ్రాయెల్‌పై ఏర్పాటైన స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్, పాలస్తీనా పిల్లలపై ఇజ్రాయెల్ అధికారులు, భద్రతా దళాలు పాల్పడిన ఉద్దేశపూర్వక నేరాలకు సంబంధించిన “తిరుగులేని సాక్ష్యాలను” వివరిస్తూ 100 పేజీల సమగ్ర నివేదికను విడుదల చేసింది. అక్టోబర్ 7, 2023 నుండి మార్చి 31, 2026 వరకు జరిగిన పరిణామాలను విశ్లేషించిన ఈ నివేదిక, ఈ చర్యలు జాతి నిర్మూలన, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, యుద్ధ నేరాల పరిధిలోకి వస్తాయని నిర్ధారించింది.

ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి (రిటైర్డ్), కమిషన్ చైర్ అయిన ఎస్. మురళీధర్ సమర్పించిన ఈ నివేదిక, “పిల్లలను పెద్ద ఎత్తున, వ్యవస్థాగతంగా చంపడం, గాయపరచడం” వంటి అంశాలను ఎత్తిచూపింది. అక్టోబర్ 7, 2023, అక్టోబర్ 7, 2025 మధ్య కాలంలో 20,000 మందికి పైగా పిల్లలు మరణించారని, మరో 44,000 మంది గాయపడ్డారని కమిషన్ నమోదు చేసింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో మరణించిన వారిలో పిల్లల వాటా ప్రస్తుతం 30%గా ఉంది; పిల్లలను చంపడం, గాయపరచడం అనేది ఒక “నిరంతర ప్రక్రియ”గా మారిందని కమిషన్ పేర్కొంది.

ఈ హత్యలకు ఉపయోగించిన రెండు ప్రధాన పద్ధతులను నివేదిక గుర్తించింది. మొదటిది, విస్తృత ప్రాంతంలో ప్రభావం చూపే శక్తివంతమైన పేలుడు పదార్థాలను వైమానిక దాడులలో ఉపయోగించడం. రెండవది, మరింత లక్షిత పద్ధతిలో క్వాడ్‌కాప్టర్లు, డ్రోన్లు, స్నైపర్ రైఫిళ్లను ఉపయోగించడం; వీటి ద్వారా పిల్లల తల, శరీర పైభాగాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని నివేదిక ఆరోపించింది.

పాలస్తీనా పిల్లల విద్యాభ్యాసానికి ఇజ్రాయెల్ సైన్యం వ్యవస్థాగతంగా ఆటంకం కలిగించిందని కూడా కమిషన్ గుర్తించింది; పాలస్తీనా సమాజం, మేధోపరమైన, సామాజిక పునాదులను దెబ్బతీసే ప్రయత్నంగా నివేదిక ఈ చర్యను అభివర్ణించింది. విద్యకు సంబంధించిన గణాంకాలు అత్యంత దారుణంగా ఉన్నాయి: మొత్తం పాఠశాలల్లో 97% ధ్వంసమయ్యాయి, గాజాలోని 95% విశ్వవిద్యాలయాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, 38 విశ్వవిద్యాలయాలలో 22 పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరోవంక అక్టోబర్ 2023 నుండి అక్టోబర్ 2025 మధ్య 58,554 మంది పిల్లలు తమ తల్లిదండ్రులలో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మారారని అంచనా వేసింది. పిల్లల సంక్షేమానికి అత్యవసరమైన ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, అనాథాశ్రమాలు వంటి కీలక మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.

పాలస్తీనా ప్రజల “జనాభా చైతన్యాన్ని” బలహీనపరచడానికి, వారి స్వీయ-నిర్ణయాధికారాన్ని నిరాకరించడానికి, పిల్లలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం ఒక వ్యూహాత్మక ప్రయత్నమని ఈ నివేదికలోని ఒక ప్రధాన నిర్ధారణ. పిల్లలు “వారి సామూహిక గుర్తింపు, భవిష్యత్ వారసులు” కాబట్టి, యువత పునాది నిర్మాణాన్ని దెబ్బతీయడం అనేది, ఒక సమూహంగా పాలస్తీనా ప్రజలు తమను తాము నిలబెట్టుకునే మొత్తం సామర్థ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నమని కమిషన్ పేర్కొంది.

“పిల్లల మనుగడకు ఆటంకం కలిగించే జీవన పరిస్థితుల గురించి తెలుపుతూ…ఇందులో ఆకలిని ఒక యుద్ధ పద్ధతిగా ఉపయోగించడం కూడా ఉంది; అక్టోబర్ 1, 2025 నాటికి, పోషకాహార లోపం కారణంగా పిల్లలలో 151 మరణాలను కమిషన్ నమోదు చేసింది. అదనంగా, అక్టోబర్, డిసెంబర్ 2023 మధ్య, కనీసం 1,000 మంది పిల్లలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవయవాలను తొలగించిన సంఘటనలు జరిగాయి.

ఈ నివేదిక తన పరిధిని గాజాకు మించి విస్తరిస్తూ, “చట్టవిరుద్ధమైన ప్రాదేశిక విస్తరణ” కోసం ప్రభుత్వ విధానాలను అమలు చేయడానికి వెస్ట్ బ్యాంక్‌లో స్థిరనివాసుల హింసను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని నిర్ధారించింది. ఒకే వ్యూహాత్మక లక్ష్యాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి, హింసాత్మక స్థిరనివాసుల సమూహాలకు మధ్య సహకారం ఉందని ఇది వివరిస్తుంది.

ఇంకా, గాజాలోని దురాగతాలను ప్రస్తావిస్తూ, హమాస్ పాలస్తీనియన్లపై పదేపదే తీవ్రమైన దురాగతాలకు పాల్పడిందని కమిషన్ పేర్కొంది. నివేదికలోని అంశాల ప్రకారం, ఇజ్రాయెల్ సైనిక దాడుల సమయంలో శాంతిభద్రతలు కుప్పకూలడాన్ని హమాస్ ఉపయోగించుకుని, పాలస్తీనియన్లపై “అణచివేత, హింస, చట్టవిరుద్ధమైన హత్యల” ప్రచారాలను నిర్వహించింది.

అక్టోబర్ 2025లో కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, గాజాలో పాలస్తీనియన్లు చంపటం కొనసాగుతోందని కమిషన్ నివేదించింది. పరిస్థితులు మెరుగుపడ్డాయని భద్రతా మండలికి ఇటీవల చేసిన వాదనలను ఈ నివేదిక ఖండిస్తూ, మానవతా సహాయం అవసరమైన స్థాయిల కంటే చాలా తక్కువగా ఉందని పేర్కొంది. అంతేకాకుండా, గాజా స్ట్రిప్‌లో కనీసం 70% భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి స్పష్టంగా ప్రకటించారని నివేదిక పేర్కొంది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని కమిషన్ అభిప్రాయపడింది.

ఫ్లోటిల్లా కార్యకర్తలతో సహా నిర్బంధంలో ఉన్నవారి పట్ల జరుగుతున్న ” దురుసు ప్రవర్తనను” కూడా ఈ నివేదిక ఖండిస్తోంది. పాలస్తీనా ఖైదీలు ఇజ్రాయెల్ దళాలచే హింస, అత్యాచారం, లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఆధారాలు ఉన్నాయని కమిషన్‌ పేర్కొంది.

ఇక చివరగా…సభ్య దేశాలకు,భద్రతా మండలికి జవాబుదారీతనం దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ అనేక సిఫార్సులను చేసింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.