న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజున ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో లోక్‌సభ కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. దివంగత మాజీ ఎంపీలకు నివాళులు అర్పించడం ద్వారా స్పీకర్ ఓం బిర్లా సభ కార్యకలాపాలను ప్రారంభించారు. ఆ వెంటనే, ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించడంతో సభలో గందరగోళం నెలకొంది. శాంతిని పాటించాలని స్పీకర్ బిర్లా మరోసారి సూచిస్తూ, “పార్లమెంటు ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదిక, మాట్లాడేందుకు అందరికీ సమయం కేటాయిస్తామని అన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే లోక్‌సభ వాయిదా పడింది.
కాగా, ఇదే అంశంపై రాజ్యసభలోనూ తీవ్ర గందరగోళం చెలరేగింది. నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం, దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, రామ్ మందిర్ విరాళాల కుంభకోణం వంటి అంశాలపై ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. దీంతో సభలో తీవ్ర రాజకీయ దుమారం రేగి, సభ వాయిదా పడింది.నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఈ అంశంపై చర్చ జరగాలని విపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే పట్టుబట్టడంతో సభలో తీవ్ర రాజకీయ మంటలు రాజుకున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల అంశాన్ని కూడా ప్రతిపక్ష సభ్యులు సభలో ప్రస్తావించారు. ప్రతిపక్షాల నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సభను వాయిదా వేశారు.
అంతకుముందు పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ… పార్లమెంటు సజావుగా సాగడానికి, అర్థవంతమైన చర్చలు జరగడానికి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సామూహిక సంకల్పాన్ని పెంపొందించుకోవడానికి అనుభవజ్ఞులైన పార్లమెంటేరియన్ల జ్ఞానం భారత్‌కు అవసరమని పేర్కొన్నారు.
“వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి; దేశం అభివృద్ధి పథంలో వేగంగా దూసుకెళ్తోంది, పార్లమెంటు స్ఫూర్తి ఆ వేగానికి కొత్త శక్తిని ఇస్తుంది. దేశ లక్ష్యాన్ని సాధించడానికి సానుకూల దృక్పథం చాలా అవసరం. పార్టీలతో సంబంధం లేకుండా మన పార్లమెంటులో ఎంతో మంది అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారు. ఇలాంటి సమయంలో, పార్లమెంటుకు, దేశానికి వారి అనుభవం, జ్ఞానం ఎంతో అవసరం. కాబట్టి, పార్లమెంటు సజావుగా సాగడం, అర్థవంతమైన చర్చలు జరగడం, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సామూహిక సంకల్పం ప్రస్తుత తరుణంలో అత్యంత అవసరమని నేను భావిస్తున్నానని ప్రధానిఅన్నారు.
అలాగే, నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని, “ప్రతి గొంతుకకు అవకాశం లభించేలా” చూడాలని ప్రధాన మంత్రి పార్లమెంటు సభ్యులకు పిలుపునిచ్చారు. “వాదనలు, సాక్ష్యాధారాలు పటిష్టంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పటికీ తమ సందేశాన్ని సమర్థవంతంగా తెలియజేయవచ్చు. అటువంటి తార్కికత, సాక్ష్యాధారాల వల్ల సభలో జరిగే చర్చలకు ప్రయోజనం చేకూరుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రతి గొంతుకూ వినిపించే అవకాశం లభించాలి, ప్రతి భావనకూ తగిన గౌరవం దక్కాలి. పార్లమెంటు సభ్యులందరూ సభా కార్యకలాపాలలో పూర్తి మనసుతో పాల్గొనాలని నేను ప్రోత్సహిస్తున్నాను,” అని మోదీ అన్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి రోజున తిరిగి సమావేశమైన లోక్‌సభ, ప్రతిపక్షాలు తమ నినాదాలు కొనసాగించడంతో రెండోసారి వాయిదా పడింది.
సభను మొదట మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం తిరిగి సమావేశమైన తర్వాత, ప్రతిపక్షాల తీవ్ర నినాదాల మధ్య లోక్‌సభను మళ్లీ వాయిదా వేయడానికి ముందు కార్యకలాపాలు కేవలం ఏడు నిమిషాలు మాత్రమే కొనసాగాయి.


