Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ఎస్ఐఆర్‌లో లక్షలాది ఓటర్ల పేర్ల తొలగింపుకు కుట్ర జరుగుతోంది… సీఎం రేవంత్ రెడ్డి!

Share It:

హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో తమ పేర్లు తొలగించకుండా చూసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌లో లక్షలాది ఓటర్ల పేర్లను తొలగించినట్లుగా, తెలంగాణలో కూడా ఓటర్ల పేర్లను తొలగించేందుకు “కొన్ని రాజకీయ శక్తులు” కుట్ర పన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

ఈమేరకు “మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్”లో సీఎం మాట్లాడుతూ… తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) లో ఓటర్ల పేర్లను తొలగించేందుకు “కొన్ని శక్తులు” ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో గెలిచిన తర్వాత, ఈ రాజకీయ శక్తులు తెలంగాణను లక్ష్యంగా చేసుకున్నాయని తెలంగాణలో ఓటర్ల పేర్ల తొలగింపు జరగనివ్వమని ఆయన గతంలోనే స్పష్టం చేశారు.

ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఓటును తనిఖీ చేయాలని, తద్వారా ఓటు హక్కు ఉన్న ఒక్క వ్యక్తి కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు. “ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డిగా మారి ఓటు హక్కును కాపాడాలి,” అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రూప్-1 పరీక్షలు నిర్వహించడంలో విఫలమైనందుకు గత ప్రభుత్వంపై సీఎం విమర్శలు గుప్పించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)లో ఒక RMP వైద్యుడిని సభ్యుడిగా నియమించారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం TGPSCని సమూలంగా మార్చి, గ్రూప్-1 పరీక్షలను పారదర్శకంగా నిర్వహించిందని రేవంత్ అన్నారు.

హిందువులు, ముస్లింలు తనకు రెండు కళ్లలాంటి వారని పేర్కొంటూ, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌ను తొలగిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. గుజరాత్‌లో ముందుగా ముస్లిం కోటాను తొలగించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే బీజేపీకి సవాలు విసిరారు. మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మైనారిటీ వర్గం కోసం ఉద్దేశించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, జర్మనీ, జపాన్‌లలో ఉన్న అనేక ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మైనారిటీ యువత తమ విద్యతో పాటు నైపుణ్యాలను కూడా సంపాదించుకోవాలని రేవంత్ రెడ్డి నొక్కిచెప్పారు. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.