హైదరాబాద్: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పేరుతో వస్తున్న మోసపూరిత సందేశాల గురించి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి ఓటర్లను హెచ్చరించారు. ఈ సందేశాలు, ఎన్నికల కార్డులు, ఓటరు లెక్కింపు ఫారాల్లోని వివరాలు సరిపోలడం లేదని, ఆ ఫారాలు తిరస్కరించారని తప్పుగా పేర్కొంటున్నాయి.
ఓటర్లకు నకిలీ ఈసీఐ సందేశాలు
పత్రికా ప్రకటన ప్రకారం… మోసగాళ్లు ఓటర్లను ఒక ఫోన్ నంబర్‌కు కాల్ చేయమని అడుగుతున్నారు, ఒక లింక్‌తో కూడిన వాట్సాప్ సందేశాలను కూడా పంపుతున్నారు.
ఈ సందేశాలు ఓటర్లను ఒక ఫారం నింపి, నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా రూ. 5 చెల్లించమని కోరుతున్నట్లు సమాచారం. అవి లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, సీవీవీ నంబర్లు, ఏటీఎం పిన్‌లతో సహా సున్నితమైన బ్యాంకు సమాచారాన్ని కూడా కోరుతున్నాయి. ఇలాంటి లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉందని సూచించారు. ఇలాంటి మెసేజ్ లు, ఆ కాల్స్‌ను ECI లేదా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ పంపడం లేదని స్పష్టం చేశారు. ఓటర్లను తప్పుదోవ పట్టించి వారి బ్యాంకింగ్ వివరాలను దొంగిలించేందుకు సైబర్ మోసగాళ్లు ఎన్నికల సంఘం పేరును దుర్వినియోగం చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఈసీఐ అలాంటి సందేశాలు పంపదు: తెలంగాణ సీఈఓ
తాము ఓటర్లకు అలాంటి సందేశాలు పంపమని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేశారు. ఈసీఐ లేదా తెలంగాణ సీఈఓ నుండి వచ్చినట్లుగా పేర్కొంటూ కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే అప్రమత్తంగా ఉండాలని ఓటర్లకు సూచించారు. అటువంటి మోసపూరిత కాల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించవద్దని సీఈఓ ఓటర్లను కోరారు.
అటువంటి మెసేజ్‌లు లేదా కాల్స్ అందుకున్న ఎవరైనా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రజలకు సూచించారు. ఎన్నికల సంఘం పేరుతో మెసేజ్ వచ్చిందని నమ్మి లింక్ ఓపెన్ చేస్తే.. ఓటు వివరాల సంగతి పక్కన పెడితే బ్యాంక్ ఖాతానే ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఓటర్లూ తస్మాత్ జాగ్రత్త! అని తెలంగాణ సీఈఓ హెచ్చరించారు.

