Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

యూఎస్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆంక్షలు విధించండి…అమెరికా కమిషన్‌! ​

Share It:

వాషింగ్టన్‌: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధిపతి మోహన్ భగవత్ విదేశీ పర్యటనకు ముందు, అమెరికా అధికారులు సంఘ్‌నేతలను కలవకూడదని అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్ (యూఎస్​సీఐఆర్​ఎఫ్​) సభ్యులు అన్నారు. అలాగే, సంఘ్ సభ్యులపై వాషింగ్టన్ ఆంక్షలు విధించాలన్న తమ వైఖరిని కమిషన్ పునరుద్ఘాటించింది.

భారతదేశంలో మైనారిటీల హక్కులకు భంగం కలిగిస్తూ వారిపై జరుగుతున్న దాడులకు ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలే కారణమని యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ తీవ్రంగా ఆరోపించింది. అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం కింద ఉత్తర కొరియా, పాకిస్తాన్, ఇతర దేశాలతో పాటు భారతదేశాన్ని కూడా ‘ప్రత్యేక ఆందోళన కలిగించే దేశం’గా ప్రకటించాలని ఇది వరుసగా ఏడవసారి అమెరికా ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. కాగా, యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ నివేదికలు ‘పక్షపాతంతో కూడినవి, రాజకీయ ప్రేరేపితమైనవి’ అని న్యూఢిల్లీ కొట్టిపారేసింది.

యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ అనేది అమెరికా ప్రభుత్వ శాసనసభ విభాగానికి చెందిన ఒక స్వతంత్ర, ఉభయపక్ష సంస్థ. ఇది విదేశాలలో మత స్వేచ్ఛను పర్యవేక్షించి, వాషింగ్టన్‌కు విధానపరమైన సిఫార్సులు చేస్తుంది. ప్రస్తుతం దీనికి మానవ హక్కుల కార్యకర్త డాక్టర్‌ ఆసిఫ్ మహమూద్ అధ్యక్షత వహిస్తున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు “క్రైస్తవులు, ముస్లింలతో సహా మత మైనారిటీలపై దాడులకు పాల్పడినప్పటికీ” భగవత్ అమెరికా పర్యటనకు వెళ్తున్నారని మహమూద్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంఘ్‌కు చెందినవారని కూడా ఆయన పేర్కొన్నారు.

యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ కమిషనర్ జీన్ మిల్స్ మాట్లాడుతూ… ఆర్‌ఎస్‌ఎస్ నాయకులకు భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నప్పటికీ, అమెరికా అధికారులు వారికి ఉన్నత స్థాయి సమావేశాలు, దౌత్య మర్యాదలతో గౌరవించకూడదని అన్నారు. దానికి బదులుగా, “విశ్వాస, మత స్వేచ్ఛ” ఉల్లంఘనలకు బాధ్యులైనట్లు తేలిన ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులపై ఆంక్షలు విధించడంపై వాషింగ్టన్ దృష్టి పెట్టాలి అని ఆయన అన్నారు.

అంతకు ముందు, USCIRF మాజీ ఛైర్ నాడిన్ మెంజా కూడా ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆంక్షలు విధించాలన్న అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. భగవత్ తన పర్యటన సందర్భంగా ప్యానెల్ కమిషనర్లను కలవాలని, “వారు నమోదు చేసిన వివరాలను నేరుగా విని, శ్రేయోభిలాషులతో కూడిన వేదిక నుండి కాకుండా, అదే గదిలో వాటికి స్పందించాలని” ఆమె పిలుపునిచ్చారు. అంతేకాదు సంఘ్ “శిక్షార్హమైన మతపరమైన హింస స్థాయికి చేరిన కలిగిన సంస్థ” అని 19వ తేదీన ప్రొవిడెన్స్ పత్రికలో ఆమె రాసారు.

మూడు నెలల క్రితం, “భారతదేశంలో క్షీణిస్తున్న మత స్వేచ్ఛ పరిస్థితుల”పై కమిషన్ వాషింగ్టన్‌లో ఒక విచారణను నిర్వహించింది. అక్కడ సాక్షులు “మత మార్పిడి వ్యతిరేక చట్టాలు, పౌరసత్వ చట్టాలు, మతపరమైన మైనారిటీ వర్గాలపై హింసతో సహా భారతదేశంలో తీవ్రమైన మత స్వేచ్ఛ ఉల్లంఘనలకు అనుమతించే చట్టపరమైన, రాజకీయ, సామాజిక నిర్మాణాలను పరిశీలించారు” అని కమిషన్ తెలిపింది.

మరోవైపు, గత మార్చిలో విడుదల చేసిన వార్షిక నివేదికలోనూ భారత్‌లో మత స్వేచ్ఛ పరిస్థితిపై యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ తీవ్ర విమర్శలు గుప్పించింది. మత స్వేచ్ఛ ఉల్లంఘనలకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌ వంటి వ్యక్తులు, సంస్థలను బాధ్యులుగా పేర్కొంటూ, వారిపై లక్షిత ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనకు మద్దతు ఇచ్చింది.

నాలుగు నెలల ముందు, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మధ్య ఉన్న “పరస్పర సంబంధం” “పౌరసత్వం, మత మార్పిడి వ్యతిరేక, గోవధ చట్టాలతో సహా అనేక వివక్షాపూరిత చట్టాల అమలుకు” దారితీసిందని అది పేర్కొంది.

కాగా, మార్చిలో విడుదలైన యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ తాజా వార్షిక నివేదికను భారత్ తోసిపుచ్చింది. ఆ నివేదిక “భారత్‌ను పక్షపాతంతో చిత్రీకరించిందని” విదేశాంగ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది.

“భారత్‌పై పక్షపాత విమర్శలు కొనసాగించే బదులు, అమెరికాలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న విధ్వంసకాండలు, దాడులు, భారత్‌ను పక్షపాతంగా లక్ష్యంగా చేసుకోవడం, అమెరికాలోని ప్రవాస భారతీయుల పట్ల పెరుగుతున్న అసహనం, బెదిరింపులు వంటి ఆందోళనకరమైన ఘటనలపై యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ దృష్టిసారిస్తే మంచిదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

కాగా, మోహన్‌ భగవత్ ఈనెల 25వ తేదీ నుంచి అమెరికా, కెనడా, యూకేలలో పర్యటించనున్నారు. సంఘ్ తన శత వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఆయన పర్యటన జరుగుతోంది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.