ముఖ్యాంశాలు
— అడ్డగోలు నిల్వలతో కృత్రిమ కొరత సృష్టిస్తున్న దళారులు
— వానలు లేక, రిజర్వాయర్లు ఎండిపోయి అల్లాడుతున్న సామాన్యుడు
— కూరగాయల వెనుకే బియ్యం మంట
వర్తమానం ప్రతినిధి – హైదరాబాద్: రాష్ట్రంలో ‘ఎల్ నినో’ ప్రకోపం సామాన్యుడి విస్తరిపై పడింది. వానలు కురవక, ఎండల తీవ్రత తగ్గక ఒకవైపు పంటలు ఎండిపోతుంటే.. మరోవైపు మార్కెట్లో నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. కూరగాయల ధరల భారం నుంచి తేరుకోకముందే, తెలుగు ప్రజల ముఖ్యాహారమైన సోనా మసూరి బియ్యం ధర కిలో వంద రూపాయిల మార్కును దాటడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఎండిపోతున్న జలాశయాలు.. కరవు ఛాయలు: ఈ ఏడాది సాధారణం కంటే దాదాపు 30 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు అన్ని రకాల ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు సగానికి పైగా పడిపోయాయి. అక్టోబరు నెలలోనే ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు చేరుకోవడం రాబోయే తీవ్రమైన కరవు సంకేతాలకు అద్దం పడుతోంది.
దళారుల దందా.. కృత్రిమ కొరత: వర్షాభావ పరిస్థితులను ఆసరాగా చేసుకుని దళారులు, రైస్ మిల్లర్లు అక్రమ నిల్వలకు తెగబడుతున్నారు. మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి ధరలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కొద్ది రోజుల వ్యవధిలోనే కిలో బియ్యంపై రూ. 25 నుండి రూ. 30 వరకు పెంచేయడంతో 25 కిలోల బస్తా ధర రూ. 3,000 నుంచి రూ. 4,000 వరకు పలుకుతోంది.
“ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు, పిల్లల చదువుల ఖర్చులతోనే సగం ప్రాణం పోతోంది. ఇప్పుడు బియ్యం కూడా రూ. 100 దాటితే పేదవాడు పూట గడిచేదెలా? నోటికాడి కూడును కూడా గుంజుకునేలా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాలి.” –యూనిస్, స్థానికుడు, హైదరాబాద్
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి: పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి బ్లాక్ మార్కెటీర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని బియ్యం సబ్సిడీ లేదా నిల్వలపై నిఘా పెట్టకపోతే తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


