న్యూఢిల్లీ: ఏ కాలంలోనైనా, ఏ ప్రభుత్వమైనా తమకు అనుకూలంగా ఉండే న్యాయమూర్తులనే కోరుకుంటుంది అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ (జస్టిస్ ఎస్.కె. కౌల్) వ్యాఖ్యానించారు.త్వరలో విడుదల కానున్న ఆయన ఆత్మకథ “వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్” (Without Fear or Favour) పుస్తక ప్రచురణ నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తుల నియామకాలు, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఆయన పలు కీలక అంశాలను పంచుకున్నారు.
న్యాయమూర్తుల నియామకాల విషయంలో మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ అనుసరిస్తున్న వైఖరిని విమర్శిస్తూ, కొలీజియం స్వతంత్రంగా చర్చించాలని, ముందుగా ప్రభుత్వ ఆమోదం కోరడం మానుకోవాలని కౌల్ అన్నారు.
ఇండియా టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, న్యాయవ్యవస్థ దృఢంగా నిలబడి తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దానిపైనే ఉందని ఆయన అన్నారు.
గతంలో, సుప్రీంకోర్టు అభ్యర్థుల జాబితాలో ఆరవ పేరును చేర్చడంపై అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో విభేదించిన కారణంగా , కౌల్ త్వరలో ప్రచురించనున్న ఆత్మకథలోని కొన్ని భాగాల వల్ల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
కొలీజియం అధికారికంగా చర్చలు పూర్తి చేయకముందే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి (Pre-approval) లేదా అభిప్రాయాలను కోరే పద్ధతిని ఆయన తప్పుపట్టారు. కొలీజియం స్వతంత్రంగా పేర్లను చర్చించి ప్రభుత్వానికి పంపాలని, ఆ తర్వాతే ప్రభుత్వంతో చర్చలు జరగాలని జస్టిస్ కౌల్ స్పష్టం చేశారు.
కాగా, కౌల్ జూన్ 2022 నుండి డిసెంబర్ 2023లో పదవీ విరమణ చేసే వరకు సుప్రీం కోర్టు కొలీజియంలో సభ్యుడిగా ఉన్నారు. సీజేఐ, సుప్రీంకోర్టులోని నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ఈ సంస్థ, సుప్రీంకోర్టు, హైకోర్టులకు నియామకాలను సిఫార్సు చేస్తుంది.


