టెల్అవీవ్: ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్) ఎన్నికల ఫలితాలలో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడం, అరబ్ పార్టీలు రికార్డు స్థాయి స్థానాలను గెలుచుకోవడం వల్ల అక్కడ తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాలు ప్రతిపక్ష శిబిరానికి ఒక పెద్ద రాజకీయ సంకటాన్ని తెచ్చిపెట్టాయి.
మొత్తం120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 61 స్థానాలు అవసరం. అయితే, ప్రస్తుత ఓట్ల లెక్కింపు ప్రకారం ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కుడిపక్ష కూటమికి 53 నుండి 54 స్థానాలు, మాజీ సైన్యాధ్యక్షుడు ఐసెన్కోట్ సారథ్యంలోని విపక్ష కూటమికి 48 నుండి 49 స్థానాలు మాత్రమే వచ్చేలా ఉన్నాయి. ఇద్దరూ మెజారిటీ మార్కుకు దూరంగా నిలిచారు.
ఈ ఎన్నికల్లో అరబ్ పౌరులు రికార్డు స్థాయిలో ఓటింగ్ వేయడంతో పాటు, అరబ్ పార్టీల కూటమి చారిత్రాత్మకంగా 19 స్థానాల్లో విజయం సాధించి అత్యంత కీలకమైన శక్తిగా అవతరించింది.
నెతన్యాహును గద్దె దించాలనే ఉద్దేశంతో ఉన్న విపక్ష నేత గాడి ఐసెన్కోట్ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ 19 స్థానాలు గెలిచిన అరబ్ పార్టీల మద్దతు తప్పనిసరి అవుతుంది. అయితే, విపక్ష కూటమిలోని కొన్ని జియోనిస్ట్, రైట్ వింగ్ పార్టీలు (అవిగ్డోర్ లీబర్మన్ నేతృత్వంలోని ఇజ్రాయెల్ బీటెయిను) అరబ్ పార్టీలతో చేతులు కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అరబ్ పార్టీల మద్దతు తీసుకుంటే సొంత కూటమి విచ్ఛిన్నమవుతుంది, తీసుకోకపోతే నెతన్యాహును ఓడించలేరు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతిపక్షాన్ని వేధిస్తున్న అతిపెద్ద సంకటం ఇదే.
కాగా, ఇజ్రాయెల్ రాజకీయ వ్యవస్థలోని ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే—అక్కడ ఓటర్లు నేరుగా నాయకులను కాకుండా, పార్టీల జాబితాలను చూసి ఓటు వేస్తారు. ఆపై క్నెసెట్ (పార్లమెంట్)లో మెజారిటీ సాధించేందుకు వివిధ పార్టీల మధ్య జరిగే బేరసారాల ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రస్తుత ప్రాథమిక లెక్కింపు ప్రకారం, బెన్జమిన్ నెతన్యాహు నాయకత్వంలోని ‘లికుడ్’ పార్టీ ఇప్పటికీ అతిపెద్ద ఏకైక పార్టీగా నిలిచింది. అయినప్పటికీ, నెతన్యాహుకు ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి; ఎందుకంటే ఆయన కూటమికి గతంలో ఉన్న స్పష్టమైన మెజారిటీ ఇప్పుడు కోల్పోయింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ పైనే ఉంది. ఎన్నికల తుది ఫలితాలు అధికారికంగా ధృవీకరించిన తర్వాత, ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. ఆపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరు అత్యంత అనుకూలమైనవారో నిర్ణయించి, వారిని ఆహ్వానిస్తారు. ఇజ్రాయెల్ నిబంధనల ప్రకారం ఈ అవకాశం నేరుగా అతిపెద్ద పార్టీ నాయకుడికే దక్కాలనే నియమం లేదు. దేశంలో రాజకీయ స్థిరత్వం కోసం నేతలు పట్టువిడుపులతో వ్యవహరించాలని, మరోసారి ముందస్తు ఎన్నికలు వచ్చే పరిస్థితిని నివారించాలని అధ్యక్షుడు హెర్జోగ్ ఇప్పటికే రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు.


