న్యూఢిల్లీ: ఆగ్రాకు చెందిన పీడియాట్రిక్ సర్జన్ (పిల్లల శస్త్రచికిత్స నిపుణుడు) డాక్టర్ కుల్శ్రేష్ఠ సరసమైన ధరల్లో ప్రజలందరికీ మందులు అందుబాటులోకి రావాలని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లీ సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఒకే రకమైన మందులను వేర్వేరు మెడికల్ షాపుల్లో విపరీతమైన ధరల వ్యత్యాసాలతో (ఎక్కువ లాభాల మార్జిన్లతో) అమ్ముతున్నారని గమనించిన ఆయన, ఈ దోపిడీకి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, డాక్టర్ సంజయ్ కులశ్రేష్ఠ 40 ఏళ్లుగా పిల్లలకు చికిత్స అందిస్తున్నారు.
అయితే కోర్టులో ప్రభుత్వం వెనుకడుగు వేస్తూ వస్తోంది. క్యాన్సర్ నిరోధక మందులపై ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేయాలన్న న్యాయ ఆదేశాన్ని పాటించడానికి అంగీకరించినప్పుడు, అన్ని మందులకు అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. ఈ అక్టోబర్ 27న మందుల పెరిగిన ధరల విషయంలో కోర్టు ప్రభుత్వాన్ని మరోసారి తీవ్రంగా విమర్శించింది. మొత్తం వ్యవస్థ ఫార్మా కంపెనీలకు సహాయపడేలా పనిచేస్తోందని వ్యాఖ్యానించింది.
అంతేకాదు ఒక బిడ్డ ప్రాణాన్ని కాపాడటానికి ఎంతకైనా తెగించే కుటుంబాల నిస్సహాయత కూడా డాక్టర్ కుల్శ్రేష్ఠను ఎక్కువగా కలవరపెడుతోంది. కేవలం ధరలలోని వ్యత్యాసం మాత్రమే కాదు, . మందుల కోసం తమకున్న ఏకైక గేదెను కూడా అమ్ముకోవడానికి ఆయా పేరెంట్స్ సిద్ధపడటం ఆయన గమనిస్తున్నారు.
బిల్లులు, ధరల పోలికలు, ఒకే ఒక సాధారణ ప్రశ్నతో — వేర్వేరు ఫార్మసీలలో ఒకే మందు ధర ఇంత భిన్నంగా ఎలా ఉంటుంది? — ఆయన రోగులను అధిక ధరలకు గురిచేస్తుందని తాను నమ్మే వ్యవస్థను సవాలు చేశారు.
కాగా, డాక్టర్ సంజయ్ కులశ్రేష్ఠ న్యాయపోరాటం మందుల గరిష్ట చిల్లర ధర (MRP), భారీ చిల్లర రాయితీలు. ఆసుపత్రి ఫార్మసీల ధరల నిర్ణయ పద్ధతులపై దృష్టిని కేంద్రీకరించింది.
వైద్యుడిగా ఉండి పోరాట యోధుడిగా మారిన ఆయన, తాను ఈ వ్యవస్థను ఎందుకు ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారో, తాను ఏ మార్పులు కోరుకుంటున్నారో, సరసమైన ధరల్లో మందుల కోసం పోరాటం ఇంకా ఎందుకు ముగియలేదో ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
ఆయన న్యాయపోరాటం గురించి వివరిస్తూ…సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేశారన్నది తేటతెల్లం చేశారు. ఆయన మాటల్లోనే మనం గమనిస్తే… నేను వృత్తిరీత్యా గత 40 ఏళ్లుగా ఆగ్రాలో పీడియాట్రిక్ సర్జన్‌గా ఉన్నాను. ఇటీవలి సంవత్సరాలలో నేను గమనించిన విషయం ఏమిటంటే, పిల్లల మందుల ధరలు బాగా పెరిగిపోయాయి.
రెండవ పరిశీలన ఏమిటంటే, మందుల దుకాణదారులు నా రోగులకు ఇచ్చే తగ్గింపులో ఏకరూపత లేదు. ఒకచోట మందులపై 90 శాతం తగ్గింపు ఉంటే, అదే మందుకు ఇతర దుకాణదారులు 50 శాతం తగ్గింపు ఇచ్చేవారు. అందుకే నాకు ఒక సందేహం కలిగింది, ఆగ్రాలోని మందుల దుకాణదారులు అమ్ముతున్న మందుల కవర్‌పై MRP (గరిష్ట చిల్లర ధర)ని తప్పుగా ముద్రిస్తున్నారా?
నేను గమనించిన మూడవ విషయం ఏమిటంటే, అవే మందులను ఆన్లైన్లో వేర్వేరు తగ్గింపు ధరలకు ఇస్తున్నారు. అప్పుడు నాకు ఒక అనుమానం కలిగింది, ఏదో తప్పు జరుగుతోందని, రోగులను మందుల ధరల విషయంలో మోసం చేసి, పెంచిన ధరలకు కొనేలా చేస్తున్నారని అర్థమైంది.
సరళంగా చెప్పాలంటే, ఉదాహరణకు, ఆగ్రాలో ఒకే దగ్గు మందును వేర్వేరు మందుల దుకాణదారులు మూడు వేర్వేరు ధరలకు అమ్ముతున్నారు. ఇక నా రోగులు వాడుతున్న, వేర్వేరు ధరలకు అమ్ముడవుతున్న మందుల జాబితాను నేను కోర్టుకు ఇచ్చాను.
నేను (డాక్టర్ కుల్శ్రేష్ఠ) మందుల దుకాణదారుల వ్యాపారానికి వ్యతిరేకం కాదు, ఎందుకంటే ఏ వ్యాపారానికైనా లాభం ముఖ్యమని నాకు తెలుసు. కానీ నా అధ్యయనంలో, చిల్లర వ్యాపారులు ఎలాంటి నియంత్రణలు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని, భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని నాకు అనిపించింది.
అంతేకాదు వివిధ మందుల ధరలను పోల్చడానికి, వేర్వేరు రిటైల్ కెమిస్టులు ఇచ్చిన రసీదులు కూడా నా దగ్గర రుజువుగా ఉన్నాయి. భారతదేశంలో రెండు రకాల కెమిస్టులు ఉన్నారు; ఒకటి రిటైల్ కెమిస్టులు, రెండవది ఆసుపత్రి ఫార్మసీలకు అనుబంధంగా ఉండేవాళ్ళు.
ఈ ఆసుపత్రి కెమిస్టులు రోగులను ఎక్కువగా దోపిడీ చేస్తున్నారని నేను కనుగొన్నాను. మిగిలిన రిటైలర్లు రోగులను అంతగా దోపిడీ చేయరు, కానీ, వారు మందులపై డిస్కౌంట్లు ఇస్తారు, ఇవి ఒక్కో రిటైలర్‌కు ఒక్కో విధంగా ఉంటాయి. దోపిడీ ఎక్కువగా రిటైల్ రంగంలోనే జరుగుతోంది, తయారీ రంగంలో కాదు, ఎందుకంటే వారు కేవలం మందుల ఉత్పత్తిలోనే నిమగ్నమై ఉంటారు.
అత్యవసర మందుల ధరలను నియంత్రించి, అవి అందుబాటులో ఉండేలా చూసేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, ఈ వాస్తవాలన్నింటినీ నేను కోర్టుకు సమర్పించానని డాక్టర్ కుల్శ్రేష్ఠ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. .
నా కేసులో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేను బిల్లుల రూపంలో సాక్ష్యాలను సమర్పించినందున, ప్రభుత్వంలోని అగ్రశ్రేణి న్యాయవాదులందరూ పెద్దగా వాదించలేదు. ప్రభుత్వం కోర్టులో, ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయం చేస్తామని, ఇతర కేసుల మాదిరిగా నాపై కేసు పెట్టబోమని చెప్పింది. కోర్టులలో ప్రభుత్వం చాలా సహకారం అందిస్తోందని ఈ ఆగ్రా డాక్టర్ పేర్కొన్నారు.


