ముహమ్మద్ ముజాహిద్
హైదరాబాద్: ఇజ్రాయెల్‌తో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముహమ్మద్ అజ్ హరుద్దీన్ తప్పుబట్టారు. ఈ చర్యలు మానవ విలువలకు, నైతిక సూత్రాలకు, పాలస్తీనాకు భారత్ అందిస్తున్న దీర్ఘకాలిక మద్దతుకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు నేడు ఒక ప్రకటన విడుదల చేశారు.
“పాలస్తీనాలో మహిళలు, చిన్నారులతో సహా అమాయక ప్రజలు తీవ్ర దాడులకు గురవుతూ ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇజ్రాయెల్‌తో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడం నైతిక, మానవతావాద ఆందోళనలను రేకెత్తిస్తోంది. పాలస్తీనా ప్రజల న్యాయమైన ఆకాంక్షలకు మద్దతు ఇవ్వడం భారత విదేశాంగ విధానంలో ఎప్పటినుంచో ఉంది. రాష్ట్ర ఆర్థిక కార్యక్రమాలు ఈ నిబద్ధతను దెబ్బతీయకూడదు. ఇజ్రాయెల్‌తో వాణిజ్య, ఆర్థిక ఒప్పందాలను ప్రభుత్వం తక్షణమే పునఃసమీక్షించుకోవాలి” అని అజరుద్దీన్ డిమాండ్ చేశారు.
నిరసనకారుల నిర్బంధం సరికాదు... ఇజ్రాయెల్ సంస్థలతో ప్రభుత్వ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా’ (ఎస్‌ఐఓ) తెలంగాణ కార్యవర్గ సభ్యులు, యువకులను పోలీసులు నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. ఎస్‌ఐఓ నాయకులను సుమారు ఏడు గంటల పాటు నిర్బంధించడం, నిరసనకారులను వేధించడం తగదన్నారు. భావప్రకటన స్వేచ్ఛ, శాంతియుత నిరసన మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని గుర్తుచేశారు. ప్రజాభిప్రాయాన్ని, నైతిక బాధ్యతలను విస్మరించి ఆర్థిక ప్రయోజనాలకే పెద్దపీట వేయకూడదని హితవు పలికారు. యువకులపై పోలీసు చర్యలను నిలిపివేసి, పౌరుల ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
