సైబరాబాద్: ఒంటరిగా ప్రయాణించడం మాని, షేర్ మొబిలిటితో పాటు ప్రజా రవాణాను ఎంచుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు రాయదుర్గంలోని టి-హబ్‌లో రేపటినుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల పట్టణ రవాణా కార్యక్రమం, ‘సైబరాబాద్ మూవ్స్ 2026’పై విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు.
‘హాయ్ చెప్పండి, మనసు విప్పండి, ఒంటరిగా వద్దు, కలిసి రండి!’ అనే నినాదంతో, ఇక్కడి స్థానికులు, ఉద్యోగులు, సైబరాబాద్‌కు ప్రయాణించేవారు “మేము సైతం” అని చెబుతూ ఈ ఉద్యమంలో చేరాలని సీపీ రమేష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజలు ముందుకు రావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కోరారు. ద్విచక్ర వాహనాలపై ఉన్నవారు మరొకరిని తీసుకురావచ్చు; కార్లలో వచ్చేవారు కలిసి ప్రయాణించవచ్చని, సైకిల్ తొక్కేవారికి ప్రత్యేక లేన్ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. నవంబర్ 26 నుంచి 28 వరకు ఇది అమలు చేయనున్నారు. పోలీసుల వద్ద ఉన్న డేటా, సీసీటీవీ కెమెరాలు, వాహనాలను లెక్కించే యంత్రాల ద్వారా, ప్రతి వీధిలో గతంలో ఉన్న రద్దీని ఈ మూడు రోజుల రద్దీతో పోల్చి, రద్దీ లేని రోడ్లను ప్రదర్శిస్తామని సీపీ అన్నారు.
ఈ ఉద్యమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), ఆర్టీసీ, హెచ్‌ఎంఆర్‌ఎల్, హెచ్‌ఎండిఏ భాగస్వాములుగా ఉన్నాయని ఆయన తెలిపారు. పలు ఐటీ సంస్థలు కూడా ఉద్యోగుల కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చాయి. ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించడానికి ఐటీ కంపెనీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో టీ-హబ్‌లో వర్క్‌షాప్‌లు, సమావేశాలు నిర్వహించనున్నారు.


