హైదరాబాద్: పాలస్తీనా ఆక్రమణలో బర్గర్ కింగ్ ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలోని పలు నగరాల్లో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. బర్గర్‌కింగ్ ఫాస్ట్‌ఫుడ్‌చైన్ గత రెండేళ్లుగా లక్షా 25వేల డాలర్ల విలువైన ఉచిత ఆహారాన్ని పంపిణీ చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలకు (IDF) బహిరంగంగా మద్దతు ఇస్తోందని’ ఆరోపణలు ఉన్నాయి. ఈమేరకు ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా (IPSP) నిన్న బర్గర్ కింగ్ అవుట్లెట్ల వెలుపల దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది.
హైదరాబాద్‌లో నిరసనకారులు వీధి నాటకం ప్రదర్శించారు, కరపత్రాలను పంపిణీ చేశారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాగతాలను ఎత్తిచూపే పోస్టర్లను ప్రదర్శించారు. ‘బర్గర్ కింగ్‌ను బహిష్కరించండి’ అనే నినాదాలు చేస్తూ IPSP సభ్యులు తమ దేశంలో బ్రిటిష్ ఆక్రమణను వ్యతిరేకించినట్లే ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించమని భారతీయులను ప్రోత్సహించారు. న్యూ ఢిల్లీ, పూణే, పాట్నా, ముంబై, విజయవాడ, కోల్‌కతా మరియు విశాఖపట్నంలలో కూడా నిరసనలు జరిగాయి.
గతంలో ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా (IPSP) ప్రధాన సంస్థల అవుట్లెట్ల ముందు నిరసనలు నిర్వహించింది, వారు పాలస్తీనియన్ల మారణహోమంలో ఇజ్రాయెల్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నారని ఆరోపిస్తూ, బహిష్కరణ, ఉపసంహరణ, ఆంక్షలు (BDS) ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.
హైదరాబాద్‌లో IPSP గతంలో మహీంద్రా, మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్, రిలయన్స్ రిటైల్, టాటాస్ జుడియో, డొమినోస్ అవుట్లెట్ల ముందు నిరసనలు నిర్వహించింది.


