అమరావతి: మంథా తుఫాను తీరాన్ని తాకింది. మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీవ్రంగా నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. కోనసీమ జిల్లాలో ఒక చెట్టు కూలిపోవడంతో ఒక మహిళ మరణించింది. దాదాపు 76వేల మందిని సహాయ శిబిరాలకు తరలించారు, రాష్ట్ర ప్రభుత్వం 219 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది.
ఒడిశాలోని ఎనిమిది జిల్లాల్లో నష్టాలు నమోదయ్యాయి. మొత్తం 15 జిల్లాల్లో సాధారణ జీవితం ప్రభావితమైంది. భారీ వర్షం కారణంగా గజపతి, రాయగడ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు రాష్ట్రాల్లో జరిగిన విస్తృతమైన నష్టాల దృష్ట్యా, కేంద్రం అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చింది.
ఈరోజు ఉదయం మంథా తుఫాను బలహీనపడింది. కానీ ఆరు గంటల పాటు దాని తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది
కాగా ‘మొంథా’ ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ వద్ద మరింత బలహీన పడనుంది. తుపాను ప్రభావంతో గాలుల ఇంకా వీస్తున్నాయి. గంటకు 85 కి.మీ నుంచి 95 కి.మీ వేగంతో గాలుల ఉంటాయని తెలిపింది.
రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. కాగా, తుపాను ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, ఆయశురర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.


