హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసారు. మరోవంక ఓటరు అవగాహన ప్రచారం జోరుగా సాగుతోంది. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ చొరవతో నైతిక ఓటింగ్, ఓటు ప్రాముఖ్యతను హైలైట్ చేసే అవగాహన డ్రైవ్ ఊపందుకుంది.
‘నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను, నా ఓటు…నా హక్కు-నా శక్తి’ అనే నినాదం జూబ్లీహిల్స్ వీధులు, కాలనీల్లో ప్రతిధ్వనిస్తోంది. ఈ ప్రచారానికి అద్భుతమైన చిహ్నం ఈమేరకు పోలింగి తేదీ- నవంబర్ 11ని ప్రదర్శించే భారీ అవగాహన బెలూన్ యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్‌లో ప్రారంభించారు. ఇది వేలాది మంది ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
కాగా, ఓటరు అవగాహన, ఓటింగ్, నైతిక భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ R V కర్ణన్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ, మార్గనిర్దేశం చేస్తున్నారు. యల్లారెడ్డిగూడలోని శ్రీ శారద మహిళా డిగ్రీ కళాశాల, రహమత్‌నగర్, షేక్‌పేటలోని చునావ్ పాఠశాలలలో జరిగిన కార్యక్రమాలు యువత, మహిళలు, సీనియర్ సిటిజన్లు, మొదటిసారి ఓటు హక్కు వచ్చిన వారిని నిమగ్నం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. EVM, VVPAT ప్రదర్శనలు, ఓటరు హెల్ప్‌లైన్, CVIGIL యాప్‌లపై సెషన్‌లు, ‘స్నేక్ అండ్ లాడర్ – జర్నీ ఆఫ్ డెమోక్రసీ’ గేమ్ వంటి సృజనాత్మక సాధనాల ద్వారా, ఓటర్లను ఇంటరాక్టివ్‌గా చేస్తున్నారు.
ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారి ఆల్ ఇండియా రేడియో, దూర్‌దర్శన్ ద్వారా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ… అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటు వేయాలని కోరారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు సజావుగా ఓటింగ్ వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే “యువత, మొదటిసారి ఓటు వేయబోతున్న వారికి అవగాహన కల్పించడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడుతుంది. ప్రతి ఓటు లెక్కిస్తారు. ఓటింగ్‌లో నైతిక భాగస్వామ్యం బలమైన దేశాన్ని రూపొందిస్తుంది” అని ఎన్నికల అధికారి ఆర్‌వి కర్ణన్ అన్నారు. పోలింగ్ తేది దగ్గర పడుతున్న కొద్దీ… జూబ్లీ హిల్స్ – ఐ వోట్ ఫర్ ష్యూర్ అనే శక్తివంతమైన సందేశాన్ని ప్రతిధ్వనిస్తుంది.


