లక్నో: అయోధ్యలోని రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. ఆలయంలో కోట్ల రూపాయల కానుకలు, నగదు మాయమవడంపై స్పందిస్తూ.. అయోధ్య బీజేపీకి ‘లంక’గా మారుతుందని, తద్వారా వారి మతపరమైన భక్తి ప్రకటనల వెనుక ఉన్న డొల్లతనం బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు.
రావణుడిని ఓడించడం ద్వారా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ‘రామచరితమానస్’లోని ‘లంక కాండం’ను ప్రస్తావిస్తూ, రామమందిరానికి సమర్పించిన నగదు, విలువైన వస్తువుల దుర్వినియోగంపై చెలరేగిన వివాదం చివరికి బీజేపీ రాజకీయ పతనానికి దారితీస్తుందని అఖిలేష్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. ‘బీజేపీ లంకాకాండ అయోధ్యలోనే జరగబోతోంది. ఈ దానభక్తులు ధరించిన ముసుగు ఎట్టకేలకు తొలగిపోయింది, ఎందుకంటే భగవంతుని దైవశక్తి తన అద్భుతాన్ని వెల్లడించింది,’ అని యాదవ్ ‘X’లో పేర్కొన్నారు. ‘ఇప్పుడు, బీజేపీ అహంకారంతో కూడిన మిరుమిట్లు గొలిపే లంకా సామ్రాజ్యం అంతమవుతుంది, అలాగే లంకాధిపతి కూడా అంతమవుతారు,’ అని ఆయన జోడించారు.
భక్తుల విరాళాలకు సంబంధించిన అవకతవకలపై దర్యాప్తు విస్తరిస్తున్న నేపథ్యంలో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలు రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి, రాయ్ సన్నిహితుడితో సహా ఎనిమిది మందిని అరెస్టు చేయడానికి దారితీసింది.
ఈ రాజీనామాలు అధికార పార్టీకి సంక్షోభం ఆరంభం మాత్రమేనని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. ‘బీజేపీ ఒకప్పుడు గొప్పలు చెప్పుకునేది ‘దాని కార్యనిర్వాహకులు ఎన్నడూ రాజీనామా చేయరు. ఇప్పుడు వారు రాజీనామాలను త్యాగపత్రం అని పిలుస్తున్నారు,’ అని విస్తృత సంఘ్ పరివార్‌లో అంతర్గత అధికార పోరాటం జరగబోతోందని ఆయన జోస్యం చెప్పారు.
‘ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు అంతర్గత పోరాటం మొదలవుతుంది. వారి “పార్టీలు, సంఘ్, సభ, పరిషత్, వాహిని, ట్రస్ట్” ముఠా ఒకరి రహస్యాలను ఒకరు బయటపెట్టుకోవడం ప్రారంభిస్తారు. దొంగిలించిన సొమ్ముతో నిండిన సంచులతో’ వారు చెల్లాచెదురై పారిపోయేలోపే సరిహద్దులను మూసివేయాలి,’ అని ఆయన ఆరోపించారు.
‘దేవుడి ఆడిట్’ అని తాను అభివర్ణించిన దాని నుండి బీజేపీ తప్పించుకోలేదని ఎస్పీ అధినేత ఇంకా పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో పదేపదే జరుగుతున్న పరీక్ష పత్రాల లీకేజీ ఆరోపణలతో ఈ వివాదాన్ని యాదవ్ ముడిపెట్టారు. ‘ఇప్పటికే రాజీనామాలు మొదలయ్యాయి కాబట్టి, లీకుల అధిపతిని కూడా రాజీనామా చేయించాలని నీట్ విద్యార్థులు అంటున్నారు,’ అని ఆయన అన్నారు.
ఆలయ విరాళాల లెక్కల్లో జరిగిన అవకతవకలను యాదవ్ ఎగతాళి చేశారు. ‘లెక్కించే విధానమే తారుమారుగా ఉన్నప్పుడు గణితం చదివి ప్రయోజనం ఏమిటి? బంగారం, వెండి తూకం తక్కువగా వేస్తున్నారు, ఆభరణాలు దొంగిలిస్తున్నారు?’ అని ఆయన ప్రశ్నించారు. ఆరోపిత అక్రమాలను వేళ్లూనుకుపోయిన అవినీతికి నిదర్శనంగా పేర్కొన్న అఖిలేష్ యాదవ్, ఈ వ్యవహారం ‘దీపం కింద చీకటి’ అనే సామెత పరిధిని మించిపోయిందని అన్నారు. “ఇది కేవలం దీపం కింద చీకటి వంటి విషయం కాదు; ఇది అవినీతి అనే గాఢాంధకారంతో నిండిన అగాధం,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆ ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయని తాను ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నానని పేర్కొన్న అఖిలేష్, ఈ కుంభకోణం తన ముందస్తు వాదనలను నిజం చేసిందని ఆరోపించారు. “ఆ గొప్ప ఆలయంలో జరిగిన దొంగతనం ఏదో ఒక రోజు బయటపడుతుందని నేను అప్పుడే చెప్పాను,” అని ఆయన అన్నారు.
చారిత్రక పోలికను ప్రస్తావిస్తూ ఆయన ఇలా అన్నారు: “చరిత్రలో 17 సార్లు దోచుకున్న వారు శతాబ్దాలుగా అపఖ్యాతి పాలయ్యారు. భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండిని లెక్కించే సమయంలో ఎనిమిది మంది ఉద్యోగులు క్రమపద్ధతిలో దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. కేవలం 40 రోజుల వ్యవధిలోనే 70 సార్లు దొంగతనాలు జరిగాయని గుర్తించారు. వారు చరిత్రలో నల్ల అక్షరాలతో (చెడుగా) నమోదు కాబోతున్నారు.”
ఈ భారీ దొంగతనం గత లావాదేవీలపై కూడా అనుమానాలు రేకెత్తిస్తోందని ఆయన ఆరోపించారు. “దీని గురించి ఆలోచించండి: కేవలం ఏడు వారాల్లోనే ఇంత భారీ దొంగతనం చేసిన వారు, ఇన్నేళ్లలో ఎంత దోచుకుని ఉంటారు? వారు తమలో ఎంత పంచుకున్నారు, ఎంత రహస్యంగా దాచారు, తమ నాయకుడికి ఎంత చేరవేశారు? ఇది అత్యంత హేయమైన చర్య!” అని అఖిలేష్‌యాదవ్ అన్నారు.
కాగా, అక్రమాల ఆరోపణలను బీజేపీ,రామమందిర ట్రస్ట్ ఖండించాయి, అదే సమయంలో విరాళాల నిర్వహణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కొనసాగుతోంది.

