హైదరాబాద్: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును కంకరలోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో కనీసం 19 మంది మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణిస్తున్నారు. చేవెళ్ల రోడ్డులోని మీర్జాగూడ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
టిప్పర్, ఆర్టీసీ బస్సు అధిక వేగంతో ఎదురెదురుగా వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అతివేగంతో టిప్పర్‌ను నడపడం.. స్పీడ్ కంట్రోల్ కాకపోవటంతోనే ఆర్టీసీ బస్సును ఢీకొట్టి ఉండవచ్చని భావిస్తున్నారు.
ప్రమాదం కారణంగా బస్సుపై కంకరపడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద చిక్కుకున్నారు. పోలీసులు, అత్యవసర సేవలు సంఘటనా స్థలానికి చేరుకొని మూడు జేసీబీల సాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. కంకర కింద కూరుకుపోయిన వారిని బయటికి తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దుర్ఘటన వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం గురించి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వారికి సూచించారు.
బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డిలను ఆదేశించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.
కాగా, చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించడానికి సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. బాధితులు 9912919545 లేదా 9440854433 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.


