హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర 11న జరిగే ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ – కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉండబోతోంది. కాగా, ఈ కీలకమైన ఉప ఎన్నికల్లో గెలవడానికి ఆయా పార్టీలు తమ ప్రచారంలో భావోద్వేగ విజ్ఞప్తులు, విజయాల గురించి గొప్పలు చెప్పుకోవడం, తీవ్ర ఆరోపణలు చేయడం,హెచ్చరికలను ఆశ్రయించారు.
పోలింగ్‌కు ఇంక వారం రోజులు మిగిలి ఉండగా…ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. డజన్ల కొద్దీ కార్పోరేటర్లు, ప్రముఖ రాజకీయ నాయకులు ఉదయం నడకలు, కార్నర్ మీటప్లు, ఇంటింటికి సందర్శనలు, భారీ రోడ్‌షోలు, కుల ఆధారిత సమావేశాలు, క్లోజ్డ్ డోర్ సమావేశాలు, సహపంక్తి భోజనాలు వంటి విభిన్న కార్యక్రమాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు.
బీసీ నేత అయిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 2014 ఎన్నికల్లో AIMIM టికెట్‌పై పోటీ చేశారు. తర్వాత ఆ పార్టీని వీడి 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2023లో ఆయన కాంగ్రెస్‌లో చేరి, జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసిన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ తరపున ప్రచారం చేశారు. గతంలో 2014, 2018లో కూడా ఈ సీటును గెలుచుకున్న మాగంటి గోపీనాథ్ చేతిలో అజారుద్దీన్ 16,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సానుభూతి, సద్భావనను పెంచుకోవాలనే ఆశతో BRS గోపీనాథ్ భార్య మాగంటి సునీతను నామినేట్ చేసింది. 2023లో 25,866 ఓట్లు సంపాదించిన లంకాల దీపక్ రెడ్డిని బిజెపి మరోసారి నిలబెట్టింది. కాగా, 2009 నుండి కాంగ్రెస్ జూబ్లీహిల్స్ సీటును గెలుచుకోలేదు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో సరికొత్త కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పోలింగ్ బూత్ లెవెల్లో ఓటరును నేరుగా కలిసే కార్యక్రమాన్ని రూపొందించారు. పోలింగ్ బూత్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్సర్స్తో నియోజకవర్గ ఇబ్బందులను వీడియోలుగా చేయించాలని నిర్దేశించారు. బూత్ స్థాయిలో కీలకమైన వ్యక్తుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రచార వేగాన్ని మరింతగా పెంచాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సర్వేలు తమకి అనుకూలంగా ఉన్నాయని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజారిటీ పెంచే అంశంపై మంత్రులు దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశం చేశారు.


