న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నిన్న సాయంత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో కనీసం 9 మంది మృతి చెందగా,20 మందికి పైగా గాయపడ్డారు. అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. కాగా, హర్యానాలోని గురుగ్రామ్‌లో కారు యజమాని ఎండీ సల్మాన్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కారు ముగ్గురి చేతులు మారినట్లు తెలుస్తోంది.
మొదటసల్మాన్ దానిని తారిఖ్ అనే వ్యక్తికి అమ్మినట్లు గుర్తించారు. అయితే అక్కడి నుంచి అది డాక్టర్ ఉమర్ చేతికి వెళ్లింది. డాక్టర్ ఉమర్ ఆ కారును నడిపినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పేలుడు తీవ్రత వల్ల సమీపంలోని వాహనాల అద్దాలు కూడా పగిలిపోయాయి. అలాగే శబ్దం సెంట్రల్ ఢిల్లీలోని ఐటీఓ వరకు వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన వారందరినీ సమీపంలోని ఎల్ఎన్జేపీ (LNJP) ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు.
పేలుడుకు కారణాన్ని తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. ఏ ఒక్క అవకాశాన్నీ కొట్టిపారేయడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇది ఉగ్రవాద దాడి కాదా అని అడగ్గా, షా మాట్లాడుతూ, “సంఘటనకు కారణమేమిటో చెప్పడం కష్టం. పేలుడు స్థలం నుండి స్వాధీనం చేసుకున్న నమూనాలను ఫోరెన్సిక్స్, NSG విశ్లేషించే వరకు, మేము ఏమీ చెప్పలేము. కానీ మేము దేనినీ తోసిపుచ్చడం లేదు అని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. “ఈ సాయంత్రం ఢిల్లీలో జరిగిన పేలుడులో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని X లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
బాధితులకు అధికారులు సహాయం అందిస్తున్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర సీనియర్ అధికారులతో పరిస్థితిని సమీక్షించినట్లు ఆయన ధృవీకరించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ… ఈ “లోపానికి” కారణమైన వారిని జవాబుదారీగా ఉంచాలని అన్నారు. ఈ ఘటనపై త్వరిత,సమగ్ర దర్యాప్తును చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ వార్త వినడం చాలా బాధాకరం. ఈ సంఘటనలో అనేక విలువైన ప్రాణాలు కోల్పోయాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ దుఃఖ సమయంలో, మా ఆలోచనలు, ప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము” అని ఖర్గే X లో పేర్కొన్నారు.
ఫరీదాబాద్‌లో కాశ్మీరీ వైద్యుడు అరెస్టు
హర్యానాలోని ఫరీదాబాద్‌లో కాశ్మీరీ వైద్యుడు అద్దెకు తీసుకున్న వసతి గృహం నుండి దాదాపు 360 కిలోల అనుమానిత అమ్మోనియం నైట్రేట్,ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు సంభవించింది.
హర్యానా పోలీసులు, జమ్మూ – కాశ్మీర్ అధికారుల సమన్వయంతో, ఫరీదాబాద్‌లోని ధౌజ్ ప్రాంతం నుండి డాక్టర్ ముజమ్మిల్‌ను అరెస్టు చేసి, అతని అద్దె ఇంటి నుండి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, టైమర్లను స్వాధీనం చేసుకున్నారు. అల్ ఫలా విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడైన నిందితుడు శ్రీనగర్‌లోని ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్‌కు సంబంధించిన కేసులో వాంటెడ్‌గా ఉన్నట్లు సమాచారం.


