ఖార్తూమ్: ఒకప్పుడు ఆఫ్రికాలోని విభిన్న తెగలు, భాషలు, మతాలు, సంస్కృతులు కలసి జీవించిన నేల సూడాన్. కానీ, నేడు ఆ దేశపు పేరు వింటే నెత్తుటి వాసన రావడం విషాదం. తాజాగా సుడాన్‌లోని అల్ ఫషర్‌లో సామూహిక దురాగతాలు, తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేశారు. కోర్డోఫాన్ ప్రాంతంలో కూడా హింస తీవ్రమవుతోందని అన్నారు. సుడానీస్ సాయుధ దళాలు, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) పారామిలిటరీల మధ్య పోరాటం తీవ్రతరం అవుతున్నందున వెంటనే యుద్ధాలను నిలిపివేయాలని ఆంటోనియో గుటెర్రెస్ ఎక్స్‌లో పిలుపునిచ్చారు.
“బయటినుంచి వస్తున్న ఆయుధాలు,యోధుల రాకడను నిలిపివేయాలి” అని ఆయన అన్నారు, మానవతా సహాయం వసరంలో ఉన్న పౌరులను త్వరగా చేరుకోవాలి” అని నొక్కి చెప్పారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి చర్చల పరిష్కారం వైపు “వేగవంతమైన, ఖచ్చితమైన చర్యలు” తీసుకోవాలని UN చీఫ్ ఇరుపక్షాలను కోరారు.
అక్టోబర్ 26న, ఉత్తర డార్ఫర్ రాష్ట్ర రాజధాని అల్ ఫాషర్ నగరాన్ని RSF స్వాధీనం చేసుకుంది. స్థానిక, అంతర్జాతీయ సంస్థల ప్రకారం…ఈ దాడి దేశ భౌగోళిక విభజనకు దారితీస్తుందనే హెచ్చరికల మధ్య, ఊచకోతలకు పాల్పడింది. అల్ ఫాషర్‌ను RSF స్వాధీనం చేసుకున్న తరువాత, తిరుగుబాటుదారుల సమూహం, సూడాన్ సైన్యం మధ్య ఘర్షణలు కొత్త సరిహద్దులకు, ముఖ్యంగా మధ్య, దక్షిణ కోర్డోఫాన్ రాష్ట్రాలకు వ్యాపించాయి.
సూడాన్‌లోని 18 రాష్ట్రాలలో, ఆర్ఎస్ఎఫ్ ఇప్పుడు డార్ఫర్ ప్రాంతంలోని ఐదు రాష్ట్రాల్లో ఆధిపత్యం సంపాదించింది. ఉత్తర డార్ఫర్‌లోని కొన్ని ఉత్తర ప్రాంతాలు ఇప్పటికీ సైన్యం నియంత్రణలో ఉన్నాయి. రాజధాని ఖార్టూమ్‌తో సహా దక్షిణ, ఉత్తర, తూర్పు, మధ్య ప్రాంతాలలోని మిగిలిన 13 రాష్ట్రాలలో చాలా వరకు సూడాన్ సైన్యం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇక 2023 ఏప్రిల్‌లో ప్రారంభమైన సైన్యం, ఆర్ఎస్ఎఫ్ మధ్య జరిగిన యుద్ధం వేలాది మందిని చంపింది. లక్షలాది మందిని నిరాశ్రయుల్ని చేసింది.


