31.2 C
Hyderabad
Friday, October 4, 2024

‘సాయం అందకుంటే ఆకలితో చచ్చిపోతాం’…బీహార్‌ వరద బాధితులు!

పాట్నా: దర్భంగా జిల్లాలోని కోసి నదికి వరదల కారణంగా నిర్వాసితులైన ప్రజల వేదన వర్ణనాతీతం. ఆదుకునే నాధుడు లేక అన్నమో రామచంద్ర అంటున్నారు. అధికారులు తొందరగా సాయం అందించకపోతే ఆకలితో చచ్చిపోవడం ఖాయమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే… దర్భంగా జిల్లాలోని భోభౌల్ గ్రామంలో సెప్టెంబరు 29న అర్ధరాత్రి 80 అడుగుల మేర కట్ట తెగిపోవడంతో కోసి నది చుట్టుపక్కల ఉన్న దాదాపు డజను గ్రామాలకు తీవ్ర వరదలు వచ్చాయి. దీని కారణంగా అక్కడి ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపాల్సి వస్తోంది.

అదే జిల్లాలోని నర్కతీయ భండారియా గ్రామానికి చెందిన గంగా పాశ్వాన్ మాట్లాడుతూ, సెప్టెంబరు 30న అర్ధరాత్రి కోసి నది కర కట్ట తెగిపోతోందని మా గ్రామానికి వార్త వచ్చిందని తెలిపారు. దీంతో సర్వస్వం ఇంట్లో వదిలి వట్టి చేతులు, కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చేసాం. అప్పటినుంచి కుటుంబంతో కలిసి రోడ్డుపైనే జీవనం సాగిస్తున్నామని వాపోయాడు.

దర్భంగాలోని మరో వరద ప్రభావిత గ్రామమైన కుబౌల్‌లో నివసిస్తున్న భండారి యాదవ్ తన కుటుంబంతో కలిసి గట్టుపై నివసిస్తున్నాడు. “నా ఐదు పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ధాన్యం కూడా పాడైపోయిందని,” అతను రోదిస్తూ చెప్పాడు.

బీహార్‌లోని సుపాల్, నలంద, గయా, భాగల్‌పూర్, కతిహార్, దర్భంగా, సీతామర్హిలతో సహా 18 జిల్లాలకు చెందిన 30.62 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం 44 సహాయ శిబిరాలు, 266 కమ్యూనిటీ కిచెన్‌లు నడుస్తున్నాయి.

వరద బాధిత కుటుంబాలకు 278,451 పాలిథిన్ మరియు 98,376 డ్రై ఫ్రూట్ ప్యాకెట్లను శాఖ పంపిణీ చేసింది. అదే సమయంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు 1,973 బోట్లు, 19 ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు, 24 ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు పాలనాపరమైన సహాయం అందలేదని పలువురు ఆరోపిస్తున్నారు

ఈ ఏడాది బీహార్‌లో రుతుపవనాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో సెప్టెంబర్ 30 వరకు రుతుపవనాలలో 798.3 మిమీ వర్షపాతం నమోదైంది, ఇది సాధారణ వర్షపాతం 992.2 మిమీ కంటే 20% తక్కువ అని రాష్ట్ర విపత్తు శాఖ తెలిపింది. అయితే గత కొద్ది రోజులుగా నేపాల్‌లోని టెరాయ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది నేపాలోని కోసి, గండక్, బాగమతి, మహానంద వంటి నదుల నీటి మట్టం విపరీతంగా పెరిగింది.

ఫలితంగా, సీతామర్హి, పశ్చిమ చంపారన్, షియోహర్, దర్భంగా జిల్లాల్లోని ఏడు చోట్ల నదుల కట్టలు తెగిపోయాయి. కట్ట తెగిపోవడంతో వాటిని ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి వరద నీరు వేగంగా వ్యాపించింది. పలు ప్రాంతాల్లో కాంక్రీట్‌ ఇళ్లు సైతం కూలిపోయాయి. రాత్రికి రాత్రే లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
అక్టోబర్‌లో వరదలు రావడం సాధారణ విషయం కాదని, వాతావరణ మార్పులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles