30.2 C
Hyderabad
Sunday, May 5, 2024

రమజాను మాసమా స్వాగతం!

పవిత్ర ఖుర్ఆన్ రంజాన్ మాసంలో అవతరించింది. ఈ గ్రంధం మానవులందరికి మార్గదర్శకం (ఖుర్ఆన్ 2:185)

శుభాల సరోవరం, సత్కార్యాల సమాహారం, వరాల వసంతం వచ్చేసింది. రమజాన్ పేరు వినగానే ఎవరికైనా ఒక రకమైన దివ్యానుభూతి కలుగుతుంది. ఈ నెలలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. నరక ద్వారాలు మూసి వేస్తారు.  నిజానికి రమజాన్ అన్నది ‘ఇస్లామిక్ క్యాలెండర్’లోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. దీనికింతటి ప్రత్యేకత, ప్రాశస్య్తం రావడానికి  కారణం సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంధమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించడమే. అందుకే రంజాన్  మాసానికి అంత గౌరవం, ఘనత, పవిత్రత దక్కింది.

మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ (ఉపవాసవ్రతం) అనే గొప్ప ఆరాధనను కూడా దైవం ఈ నెలలోనే  విధిగా చేశాడు.

దైవభీతి పెంపొందించడమే రోజా ఉద్దేశ్యం….

ఉపవాసాలు మనిషిని భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎదగడంలో ఎంతో సహకరిస్తాయి. ఇటు మనిషిని శారీరకంగా బలపరుస్తూ, మానసికంగా వికసింపజేస్తూ ఉంటాయి. ఈ భౌతిక, ఆధ్యాత్మిక వికాసాల సమ్మేళనమే ఉపవాస ఉద్దేశం. వాస్తవానికి దైవ సన్నిధిలో ఇలాంటి ఉపవాసాలే నిజమైన ఉపవాసాలుగా పరిగణించబడతాయని మహా ప్రవక్త ముహమ్మద్ (స) ప్రవచించారు.

ఉపవాసం ద్వారా మనిషిలో తఖ్వా (భయభక్తులు) కలగాలన్నదే ఉపవాసం లక్ష్యం. మనిషి ఉపవాసంతో ఉన్నప్పుడు తన కోరికలను అదుపులో ఉంచుకోవాలి. నిరుపేదల పట్ల సానుభూతి కలుగుతుంది. ఉపవాస స్థితిలో కలిగే ఆకలిదప్పులు బీదవాళ్ళ ఆకలి బాధను గుర్తు చేస్తాయి.

అంతేకాదు రోజా… మనలో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాప కార్యాలు, దుర్మార్గాల వైపుకు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి మంచి మంచి గుణాలు అలవడతాయి.

రమజాను నెలలో ఖుర్‌ఆన్‌తో మన సంబంధాన్ని పటిష్టం చేసుకోవాలి. తరావీహ్‌లో పఠించబోయే ఆయత్‌ల అనువాదాన్ని ముందుగానే మనం చదువుకోవాలి. తద్వారా మనకు ఖుర్‌ఆన్‌ సులువుగా అర్థం అవుతుంది. మనం తరావీహ్‌ నమాజ్‌లో సులువగా లీనమైపోతాం.

రమజాను నెలను మూడు భాగాలుగా విభజించారు. మొదటి పది రోజుల కాలం దైవం తన అపారమైన కరుణను మానవులపై వర్షింపజేస్తాడు. రెండో పదిరోజులు సౌభాగ్యం, సమృద్ధిని నమ కూర్చేకాలం. ఇక చివరి పది రోజులు నరకాగ్ని నుంచి విముక్తి లభింపజేసేవి.

రమజాను చివరి దశకంలో వచ్చే ఘనమైన రాత్రిని పొందేందుకు ప్రయత్నం చేయాలి.

రమజాన్ చివరి దశకంలో తొమ్మిది, పదిరోజుల పాటు ప్రపంచ వ్యవహారాలన్నీ పక్కనపెట్టి కేవలం దైవారాధన, దైవనామస్మరణ సంకల్పంతో మస్జిదులో ఉండిపోవడాన్నే ఏతెకాఫ్ అంటారు. ప్రతి ఏటా రమజాన్ నెల చివరి పది రోజులు మస్జిద్ ఏతెకాన్ పాటించడం ప్రవక్త(స) సంప్రదాయం.

దైవ ప్రసన్నత కోసం ఏతికాఫ్ పాటించే వ్యక్తి పాపాలన్నీ క్షమించివేస్తారని మహా ప్రవక్త(స) సెలవిచ్చారు. ఏతికాఫ్ పాటించనివారు ఎక్కువ సమయం మస్జిదులో గడిపే ప్రయత్నం చేయాలి. తమ పాపాలను క్షమించమని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.

నమాజ్ తరువాత అత్యంత పుణ్యప్రదమైన కార్యం. దైవ మార్గంలో దైవం ప్రసాదించిన వాటన్నింటిలోనుంచి కొంతైనా ఖర్చు చేయాలి. దీనితోపాటు దైవం ప్రసాదించిన సమయాన్ని, బుద్ధిబలాలను శక్తిసామర్థ్యాలను దైవమార్గంలో ఖర్చు చేయాలి. దైవప్రవక్త (స) అందరికంటే ఎక్కువగా దానధర్మాలు చేసేవారు. రమజాన్ లో చేసే రోజాలు, జకాత్ దానాలు, తరావీహ్ నమాజులు అన్నీ ఆ అల్లాహ్ చూస్తున్నాడు అనే స్పృహతో చేయాలన్నది ప్రవక్త బోధనల సారాంశం!

ప్రస్తుతం దేశంలోని రాజకీయాలు, మతతత్వ ధోరణుల నేపథ్యంలో ఇస్లాం అంటే ఏమిటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనికోసం మనం ఇఫ్తార్ పార్టీలను విరివిగా వాడుకోవాలి.

 

 

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles