న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ), జాతీయ రహదారి (ఎన్హెచ్)-63లోని ప్రస్తుత ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల విభాగాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) పద్ధతిలో, జాతీయ రహదారి (ఎన్హెచ్)-563లోని జగిత్యాల-కరీంనగర్ విభాగాన్ని బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టోల్) పద్ధతిలో 4-లేన్ల ప్రమాణాలకు విస్తరించడానికి ఆమోదం తెలిపింది. ఈ పనుల మొత్తం పొడవు 190.76 కిలోమీటర్లు కాగా, దీని మొత్తం మూలధన వ్యయం రూ. 7,597.16 కోట్లు.
ఇక ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల ప్రాజెక్ట్ విభాగం తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల గుండా వెళుతుంది. ఈ రహదారి వెంబడి అంక్సాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్షెట్టిపేట, మంచిర్యాల వంటి అనేక నివాస ప్రాంతాలు ఉండటం వల్ల ప్రస్తుతం ఈ మార్గం తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొంటోంది. అదేవిధంగా, జగిత్యాల-కరీంనగర్ మార్గం జగిత్యాల, పోతారం, గంగాధర, కరీంనగర్ వంటి అత్యంత రద్దీగా ఉండే, జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల గుండా వెళుతుంది. ఈ ప్రాజెక్టులలో జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు బైపాస్లతో కూడిన 4-లేన్ల రహదారి నిర్మాణం, ఓపెన్ టోలింగ్ విధానం ప్రతిపాదించారు.
దీనివల్ల తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల మరియు కరీంనగర్ జిల్లాల వ్యాప్తంగా గంటకు 100 కిలోమీటర్ల డిజైన్ వేగం, మెరుగైన ప్రయాణానికి వీలవుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ రవాణాను మెరుగుపరచడంతో పాటు సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని ఆ ప్రకటన తెలిపింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, ఆర్మూర్, మంచిర్యాల మధ్య ప్రయాణ సమయం సుమారు 1 గంట 30 నిమిషాలు, జగిత్యాల, కరీంనగర్ మధ్య సుమారు 45 నిమిషాలు తగ్గుతుందని అంచనా. అదే సమయంలో ప్రయాణీకుల, సరుకు రవాణాకు సురక్షితమైన, వేగవంతమైన, నిరంతరాయమైన కనెక్టివిటీ లభిస్తుంది.
అదనంగా, ఈ ప్రాజెక్ట్ వల్ల ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాలు మరియు వాహన నిర్వహణ ఖర్చులు (VOC) గణనీయంగా తగ్గుతాయని ఆ ప్రకటన వివరించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 34.43 లక్షల పనిదినాల ప్రత్యక్ష ఉపాధి, మరో 42.7 లక్షల పనిదినాల పరోక్ష ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
ఈ ప్రాజెక్టులు పీఎం గతిశక్తి సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయని, ఇవి ఐదు ఆర్థిక కేంద్రాలను, ఏడు సామాజిక కేంద్రాలను, 10 లాజిస్టిక్ కేంద్రాలను అనుసంధానిస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనివల్ల దేశ లాజిస్టిక్ పనితీరు సూచిక (ఎల్పీఐ)పై సానుకూల ప్రభావం పడుతుందని కూడా తెలిపారు. తెలంగాణలో హైవే ప్రాజెక్టులకు సీసీఈఏ ఆమోదం తెలిపిన తర్వాత, ప్రధాని మోదీ తన ఎక్స్ హ్యాండిల్లో, “తెలంగాణలో మౌలిక సదుపాయాలకు ఊతం!” అని రాశారు.


