న్యూఢిల్లీ: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను 2026 డిసెంబర్‌లో తెలంగాణలో నిర్వహించడానికి కేంద్రం అంగీకరించింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లలో ఆతిథ్య వేదికలను దీనికి కేటాయించారు. ఈ ఎనిమిదవ ఎడిషన్‌లో 25 క్రీడాంశాలు ఉంటాయి. ఒక స్థానిక క్రీడను ప్రతిపాదించడంతో పాటు, మరో కొత్త క్రీడాంశాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణకు అనుమతి ఉంది. దేశవ్యాప్తంగా 6000 మందికి పైగా అథ్లెట్లు పోటీపడతారని అంచనా.
ఈ క్రీడల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 21.17 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, జాతీయ క్రీడా సమాఖ్యలు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సీబీఎస్ఈ, ఖేలో ఇండియా స్కీమ్ అడ్ హాక్ కమిటీ, స్టీరింగ్ కమిటీలు సంయుక్తంగా ఈ క్రీడలను నిర్వహిస్తాయి. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత యువతలో అపారమైన క్రీడా ప్రతిభ ఉందని, అయితే గత ప్రభుత్వాలు క్రీడా మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం, ప్రతిభను గుర్తించడంలో నిర్లక్ష్యం వహించాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మారుమూల ప్రాంతాల ప్రతిభను ప్రోత్సహించే ‘ఖేలో ఇండియా’ వంటి కార్యక్రమాలతో క్రీడల కేటాయింపులు గణనీయంగా పెరిగాయని ఆయన నొక్కి చెప్పారు. ఖేలో ఇండియా పథకం కింద, తెలంగాణలో దాదాపు రూ. 30 కోట్ల విలువైన క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రూ. 11.5 కోట్ల విలువైన సౌకర్యాల కోసం సింథటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టులు, మహిళల కోసం ప్రత్యేక స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేశారు. మరో రూ. 18.5 కోట్లను వివిధ పట్టణాల్లో క్రీడా సౌకర్యాల కోసం వినియోగించారు.


