న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సుకు వేళయింది. దేశ రాజధానిలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు ఢిల్లీ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. కాగా, వివిధ ప్రపంచ దేశాల నేతలను ఒకచోట చేర్చనున్న బ్రిక్స్ సదస్సుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం ముఖ్యమైన ప్రపంచ సమస్యలపై అర్థవంతమైన చర్చలకు ఒక వేదికను అందిస్తుందని ఆయన అన్నారు.
ఉమ్మడి ప్రాధాన్యత అంశాలపై బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, పరస్పర ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం వంటివి ఈ సమావేశంలో జరుగుతాయని MEA విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రవాణా అనుసంధానం, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచే అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. అలాగే ఆరోగ్యం, వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధనం, విపత్తు నిర్వహణ, సరఫరా వ్యవస్థలు వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపైనా దృష్టి సారించనున్నారు. ప్రపంచ రాజకీయ పరిణామాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలను ముందుకు తీసుకెళ్లడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవంక బ్రిక్ సదస్సు భద్రతా ఏర్పాట్లలో భాగంగా నగరవ్యాప్తంగా సుమారు 15,000 మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది, 200 కంపెనీల పారామిలిటరీ దళాలు, 500కు పైగా సీసీటీవీ కెమెరాలను మోహరించారు. అధికారులు నగరవ్యాప్త బంద్‌ను తోసిపుచ్చినప్పటికీ, వీవీఐపీల రాకపోకల కోసం కేటాయించిన మార్గాల్లో తాత్కాలిక ట్రాఫిక్ నిలుపుదల, దారి మళ్లింపులు, ఆంక్షలు ఉంటాయని ప్రయాణికులకు సూచించారు.
కాగా, ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఆయన ఏడేళ్ల తరువాత భారతదేశానికి రానుండటం గమనార్హం. ఈ సదస్సుకు హాజరవుతున్న ఇతర ప్రముఖులలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, అబుదాబి యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ ఉన్నారు.
బ్రిక్స్‌లో ఎవరు ఉన్నారు?
ప్రస్తుతం విస్తరించిన బ్రిక్స్ సమూహంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. బ్రిక్స్ ప్రారంభంలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో ఏర్పడింది. తర్వాత కొత్త సభ్య దేశాలు చేరడంతో సమూహం విస్తరించింది.
ఈ సదస్సులో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్-సిసి, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ తదితరులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా పలువురు ప్రముఖులు సదస్సుకు హాజరుకానున్నారు.


