28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

‘బడ్జెట్‘కు వేళాయెరా! పార్లమెంటులో రేపే కేంద్ర బడ్జెట్!

న్యూఢిల్లీ: భారత్ దాదాపు మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ జాబితా తొలి పది స్థానాల్లో నిలిచింది. దాదాపు 130 కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్ ను మరి కొద్ది గంటల్లో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారితో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఈ బడ్జెట్ పై చాలా ఆశలు పెట్టుకొంది. గత రెండేళ్లలో ఉన్నత వర్గాల ఆదాయాలు పెరిగి, మధ్య తరగతి నుంచి కిందిస్థాయి వర్గాల ఆదాయాలు పడిపోయినట్లు గణాంకాలు చెబుతుండటంతో అల్పాదాయ వర్గాలు ఆర్థిక చేయూత కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాయి. కేంద్రం నుంచి ఏం వరాలు కురుస్తాయా? అని ప్రజలు ఆశిస్తున్నారు.
ఈసారి బడ్జెట్ లో టూ వీలర్ల ధరలు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మఖ్యంగా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తే, బడ్జెట్ తర్వాత ద్విచక్ర వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేట్లను 18 శాతానికి తగ్గించాలని, తద్వారా డిమాండ్ పెరుగుతుందని, ఆటోమొబైల్ డీలర్ల సంస్థ FADA కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఎడిఎ) ద్విచక్ర వాహనాలు విలాసవంతమైన ఉత్పత్తి కాదని, అందువల్ల జిఎస్‌టి రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
రెండు దఫాలుగా జరగనున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో ‘బడ్జెట్‌’ ఎలా ఉండబోతుందో అనే అంశంపై జోరుగా ఆర్థిక మేధావుల్లో చర్చ నడుస్తోంది. 2022-23 బడ్జెట్‌లో కేంద్రం మధ్యతరగతి ప్రయోజనాల దృష్ట్యా.. రెండు రకాల పన్ను ప్రయోజనాలను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో మొదటిది స్టాండర్డ్ డిడక్షన్.. ఆదాయం నుంచి ఆ మేరకు మినహాయించి చూపించుకునే వెసులుబాటు. 2005-06 ఆర్థిక సంవత్సరంలో ఎత్తివేసిన ఈ ప్రయోజనాన్ని.. తిరిగి 2018-19 బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. మొదట రూ.40,000గా ప్రకటించి.. ఆపై 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.50,000కు పెంచింది. ఇప్పుడు దీన్ని మరి కొంత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మాదిరే రూ.10,000 పెంచుతారా? మరింత ప్రయోజనం కల్పిస్తారా? అనే దానిపై బడ్జెట్‌లోనే స్పష్టత రానుంది. వర్క్‌ఫ్రమ్‌ హోం కొనసాగుతున్న నేపథ్యంలో.. కొన్ని దేశాలు అమలు చేస్తున్న తరహా ప్రయోజనాల్ని ఆశిస్తున్నారు.
పిల్లల చదువు పొదుపు.. ఏటేటా పిల్లల విద్యపై ఖర్చు గణనీయంగా పెరిగిపోతోంది. సుకన్య సమృద్ధి యోజన.. అదీ అమ్మాయిలకు తప్పించి మరే యితర ప్రయోజనం చేకూరడం లేదు. ఈ తరుణంలో ‘సెక్షన్ 80-సీ’ కింద స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇదేమంత ప్రయోజనంగా లేదనేది అసలు విషయం. ఎందుకంటే జీవిత బీమా ప్రీమియం, ఈపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. పైగా పాఠశాల ఉన్నత విద్య, ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం చేసే పొదుపు, పెట్టుబడులకు ప్రత్యేక సెక్షన్ కింద ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, దీనిపైనా బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉద్యోగులకు కూడా వరాల జల్లులు ఉంటాయని అంటున్నారు. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా పన్ను మినహాయింపును పెంచలేదు. ఈ సారైనా పన్ను మినహాయింపు పరిమితి పెంపు ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రస్తుతం పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. గత ఎనిమిదేళ్లుగా ఈ పరిమితి ఇలానే కొనసాగుతోంది. ఈ పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని పన్ను చెల్లింపుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులను, పన్ను చెల్లింపుదారులను ఆకట్టుకునేందుకు పన్ను మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉందని మెజార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు…ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద ప్రస్తుతం ప్రభుత్వం రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులను ఇస్తోంది. ఉద్యోగులు పన్ను ఆదా చేసుకోవడానికి ఇది ఎంతో ముఖ్యం. అంతకుముందు ఈ పరిమితిని రూ.లక్షగా ఉండేది. దీన్ని రూ.1.5 లక్షలకు పెంచారు. బడ్జెట్ 2022లో ఈ పరిమితిని రూ.2 లక్షలకు పెంచుతారని ఉద్యోగులు భావిస్తున్నారు. భారత స్టార్ట్అప్ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. గత ఏడాదిలో రూ.2 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను ఆకర్షించాయి కూడా. దేశీయ అంకురాల్లో మరో 41 యూనికార్న్ (100 కోట్ల డాలర్లు/సుమారు రూ.7500 కోట్ల విలువైన సంస్థలుగా మారాయి. ఈ ఏడాది మరో 75 అంకురాలు యూనికార్న్లుగా ఎదగాలనే ఆకాంక్షను వాణిజ్య మంత్రి ఇటీవల వ్యక్తం చేశారు. ఈ లక్ష్యం సాకారం అయ్యేలా కొత్త బడ్జెట్ (2022-23) మరిన్ని ప్రోత్సాహకాలను ప్రకటించాలని స్టార్టప్ సంస్థలు కోరుతున్నాయి.
గృహ కొనుగోలుదారుల ఆశలు, స్థిరాస్తి వర్గాల అంచనాలను గమనిస్తే… బడ్జెట్లో సామాన్య, మధ్యతరగతి వాసుల సొంతింటి కలను నెరవేర్చుకునేలా ప్రోత్సాహకాలు ఉండాలని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కొవిడ్-19తో రెండేళ్లుగా ఒడుదొడుకులను ఎదుర్కొన్న నిర్మాణ రంగాన్ని పరుగులు పెట్టించేలా బడ్జెట్ రూపకల్పన ఉండాలని స్థిరాస్తి రంగం కోరుకుంటోంది.
ఇంకోవైపు రాబోయే బడ్జెట్లో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం అమిత ప్రాధాన్యం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆకాంక్షించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పరుగులు పెట్టించే నిర్ణయాలు తీసుకోవడంతో పాటు.. అసమానతల తొలగింపునకూ చర్యలుండాలని పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పనకు కేటాయింపులను పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈసారి బడ్జెట్లో పన్ను రేట్ల కోతలు ఎక్కువగా ఉండవనే తాను భావిస్తున్నానని చెప్పారు.
మరోవంక ఈసారైనా జీడీపీలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలని ఫార్మా ఇండస్ట్రీ కోరుతోంది. అలాగే పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్)కి, పలు ఔషధాలపై రాయితీని కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆరోగ్య రంగానికి ప్రస్తుతం బడ్జెట్లో జీడీపీలో 1.8 శాతం మాత్రమే కేటాయింపులు జరుపుతున్నారని, ఆ మొత్తాన్ని 2.5-3 శాతానికైనా పెంచాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా కోరింది.
2022-23 బడ్జెట్ లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.5 లక్షల కోట్ల నుంచి 1.7లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. రానున్న రెండు నెలల్లో ఎలస్ఐసీ ఐపీవోను పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఏమైనా ఆటంకాలు వచ్చి జాప్యమైతే.. ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించిన కీలక అప్డేట్లు కూడా ఈ బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి సభకు వెల్లడించే అవకాశం ఉంది. ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్‌లో మార్పులు ఉంటాయా ?.. వారిపై 5 శాతం పన్ను ఉంటుందా? అని వేతన జీవులు ఎదురు చూస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల కోసం బడ్జెట్లో ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఐఐ కేంద్రానికి సూచించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ రఘురామ్ రాజన్ బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పలు సూచనలు చేశారు. వ్యవసాయం, తయారీ రంగాల సహాయంతో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించాలనే కలలను మాత్రమే వదిలి ఇతర రంగాలపై దృష్టి సారించాలని రాజన్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కేంద్ర బడ్జెట్లో తోడ్పాటును ఆశిస్తోంది. ఏటికేడాది తెలంగాణకు పన్నుల వాటా తగ్గుతోంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అదే పరిస్థితి. మరోపక్క విభజన హామీలు, 15వ ఆర్థిక సంఘం సిఫారసులు అమలవడం లేదు. ఈ నేపథ్యంలో.. మంగళవారం కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. 75 శాతం దాకా స్వీయ రాబడులతో ముందుకు వెళ్తున్న రాష్ట్రానికి ప్రత్యేక తోడ్పాటును అందించాలని ఆర్థిక మంత్రి టి.హరీశ్ రావు, పురపాలకశాఖ మంత్రి కెటి రామారావు కేంద్ర ఆర్థికమంత్రికి ఇప్పటికీ పలు లేఖలు రాశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles