Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

‘SIR’ ఓ ‘రక్తపాతరహిత మారణహోమం’… ప్రకాష్ రాజ్‌!

Share It:

హైదరాబాద్: భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ ‘రక్తపాతరహిత మారణహోమం’ (Bloodless Genocide) గా అభివర్ణించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల వ్యవస్థలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న హైదరాబాద్‌లోని లమాకాన్‌లో పాలస్తీనా రచయిత్రి ఇబ్తిసామ్ అజెమ్ రాసిన “ది బుక్ ఆఫ్ డిసప్పియరెన్స్” నవల తెలుగు అనువాదాన్ని ఆవిష్కరించాక… ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“రక్తపాతం లేకుండా ఒక మారణహోమం జరుగుతోంది. వారు దాదాపు 12 కోట్ల మంది ఓటర్లను నిశ్శబ్దంగా తొలగించారు,” అని ముక్కుసూటిగా మాట్లాడే ప్రకాశ్‌ రాజ్ అన్నారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత జనాభా లెక్కలు జరుగుతాయని ఆయన చెప్పారు. “వీటన్నింటి వెనుక ఒక పెద్ద ప్రణాళిక ఉంది. చివరికి, రాష్ట్రాల్లోని ఎన్నికల సంఘం కార్యాలయాలు చిన్న, శక్తిహీనమైన గదులుగా మారిపోతాయి. మొత్తం సమాచారం వారి వద్దే ఉంటుంది. కులాంతర వివాహాలు ఎవరు చేసుకుంటున్నారు, ఎవరు ఏ వర్గానికి చెందినవారు, ఎవరిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాలి అనే విషయాలను తెలుసుకోవడానికి వారు ఆ సమాచారాన్ని ఉపయోగిస్తారు.”

ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మారుస్తున్నారని” ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. రాజ్యాంగం అడ్డుగా ఉండటంతో సైన్యం నేరుగా అధికారం చేపట్టలేకపోతున్నా, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని నియంత్రణ సాధిస్తున్నారని విమర్శించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ… “మన మహాప్రభు భయపడుతున్నారు. పిల్లలు ఆయన్ని భయపెట్టారు,” అని అన్నారు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో జరిగిన నిరసనను ఆయన ప్రస్తావించారు. ఆ నిరసన కారణంగానే అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.

ఆ యువత పాలకుడిని ఉలిక్కిపడేలా చేసిందని ఆయన అన్నారు. “ఆయన రెండు అడుగులు వెనక్కి వేశారు, కదా? మనం ఒక అడుగు ముందుకు వేద్దాం. ఇప్పుడు ఆ పాపం రీల్స్ తీస్తున్నాడు. రీల్ కింగ్,” అని షార్ట్ వీడియోల ద్వారా జెన్ జెడ్ మద్దతును తిరిగి గెలుచుకోవడానికి మోడీ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ ప్రకాష్‌ రాజ్ అన్నారు.

మోడీ ప్రభుత్వం ప్రజల్లో తీవ్రమైన భయాన్ని నింపిందని, దీంతో రచయితలు, ఫిల్మ్ మేకర్లు స్వీయ నియంత్రణ (సెల్ఫ్ సెన్సార్‌షిప్) పాటించే దుస్థితి ఏర్పడిందని ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్మ్ సర్టిఫికేషన్, నోట్ల రద్దు, మూకదాడులు వంటి చర్యల ద్వారా ప్రజలను నిరంతరం ఆందోళనలో ఉంచుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయన పాలస్తీన్ అంశంతో పాటు, సినిమా పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సెన్సార్‌షిప్ అనుభవాలను కూడా పంచుకున్నారు.

పాలస్తీనాపై మాట్లాడే భారతీయ సినిమాలోని ప్రముఖ స్వరాలలో ఒకరైన ప్రకాష్‌ రాజ్ మాట్లాడుతూ… “సాధారణంగా, మన శరీరాలపై ఉన్న గాయాలకు మనం కార్చే కన్నీళ్ల గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ గాజాలోనో, మణిపూర్‌లోనో సుదూర ప్రాంతాల్లో మరో మనిషి బాధపడితే, ఆ బాధాకరమైన కన్నీళ్లను మనం మన కళ్లలోకి ఆహ్వానించుకోవాలి,” అని ఆయన అన్నారు.

పొదలో నక్కి ఉన్న పులిని చూసిన ఒక జింక, పారిపోకుండా ముందుకు వచ్చి అరిచిన కథతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. జింక అరుపు మందను హెచ్చరించడానికి కాదు, తనను చూశామని ఆ వేటగాడికి చెప్పడానికేనని ప్రకాష్‌రాజ్‌ సభికులకు వివరించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.