32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

ఏపీలో ఘోర రైలు ప్రమాదం…13 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు!

వైజాగ్:  ఏపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం భీమాళి సమీపాన ఆదివారం రాత్రి 7.10 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే, మృతుల సంఖ్య 20పైనే ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. వందమంది వరకు గాయపడినట్లు సమాచారం.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… విశాఖ నుంచి పలాస వెళ్తున్న పాసింజర్‌ రైలు కంటకాపల్లి దాటిన తరువాత భీమాళి సమీపాన ఓవర్‌హెడ్‌ కేబుల్‌ తెగిపడడంతో విద్యుత్‌ సరఫరా లేక పట్టాలపై నిలిచి పోయింది. దాని వెనుకే వస్తున్న విశాఖ-రాయగడ పాసింజర్‌ రైలుకు కంటకాపల్లి స్టేషన్‌లో గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో ఆ రైలు స్పీడ్‌గా వచ్చి విశాఖ-పలాస రైలును బలంగా ఢీకొంది. దీంతో, ఈ రెండు రైళ్లకు చెందిన చెరో రెండు భోగీలు పట్టాలు తప్పడమే కాకుండా నుజ్జునుజ్జయ్యాయి. పెద్ద శబ్దం రావడంతో వెంటనే భీమాళి తదితర గ్రామాల ప్రజలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాద సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు, విజయనగరం జిల్లా అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రాత్రి 11 గంటల వరకు ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో విజయనగరం జిల్లా జామి మండలం గడికొమ్ము గ్రామానికి చెందిన కె. రవి (30), గదబవలసకు చెందిన మజ్జి రాము, గరివిడి మండలం కాపుశంబాం గ్రామానికి చెందిన గిరిజాల లక్ష్మి, శ్రీకాకుళానికి చెందిన ఆకుల నాయుడు, విశాఖ-రాయగడ పాసింజర్‌ రైలు డ్రైవర్‌ ఉన్నట్లు గుర్తించారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. సుమారు వంద మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్‌ తీగెలు తెగిపోయి ఆ ప్రాంతమంతా అంథకారం నెలకొంది. దీంతో, సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

మరోవంక రైళ్లలో ప్రయాణికులను స్వగ్రామాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విజయనగరం, ఎస్‌.కోట డిపోల నుంచి బస్సులను రప్పించి ప్రయాణికులను తరలించారు. జిల్లాలోని పలు అగ్నిమాపక వాహనాలు చేరుకొని సహాయ చర్యల్లో నిమగమయ్యాయి. క్షతగ్రాతులను విజయనగరం, విశాఖ, ఎస్‌కోట  తరలించారు. సిగ్నలింగ్‌ వ్యవస్థ వైఫల్యమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం.

రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles