32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

బాపూజీ… భాయి భాయి! గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం!

 “ముస్లింలతో హృదయపూర్వక స్నేహాన్ని పెంపొందించుకోవడం తప్పనిసరి అని నేను భావిస్తున్నాను” …గాంధీజీ !

మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ  జాతి పిత. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ భుజానికి భుజం కలిపిన వారిలో ముస్లిములే ఎక్కువున్నారంటే అతిశయోతి కాదేమో! గాంధీజీకి ముస్లిములతో సన్నిహిత సంబంధాలుండేవి. మెహతాబ్ గాంధీ బాపూజీ బాల్యమిత్రుల్లో ఒకరు. చిన్నప్పుడు మెహతాబ్‌తో కలిసి గాంధీజీ ఆటలాడుకునేవారు. ఆయన బాల్యమంతా మెహతాబ్ తోనే గడిచింది. మెహతాబ్ ఇంట్లో గాంధీజీ కుటుంబ సభ్యుడిగా ఉండేవారు. గాంధీజీకి దక్షిణాఫ్రికాలో మొదటి సారి ఉద్యోగం ఇచ్చింది కూడా ఒక ముస్లిమ్ వ్యాపారి దాదా అబ్దుల్లాహ్‌నే. ఆయన దగ్గర కొంతకాలం ఉద్యోగం చేసి ఉపాధి పొందారు. గాంధీజీ సౌత్ ఆఫ్రికా వెళ్లింది కూడా ఒక సంపన్న ముస్లిమ్ సహకారంతో అనే విషయం చాలా మందికి తెలియదు. దాదా అబ్దుల్ గాంధీజీకి ఎంతగానో తోడ్పడ్డారు. దండి మార్చ్ లో తన తరువాత ప్రాతినిద్యం వహించడానకి అబ్బాస్ తయ్యబ్ జీకి బాద్యతలు అప్పగించారు. హిందూ ముస్లిముల ఐక్యత కోసం మహాత్మ గాంధీ ఎంతో ప్రయత్నించారు.

గాంధీని కాపాడిందెవరు?

మహాత్మా గాంధీని హత్య చేసిందెవరు? అని అడిగితే చిన్న పిల్లాడు కూడా గాడ్సే పేరు ఠకీమని చెబుతారు. కానీ గాంధీజీని ఓ హత్యా ప్రయత్నం నుంచి ఓ వ్యక్తి కాపాడాడన్న విషయం తెలియదు. ఆ వ్యక్తి మరెవరో కాదు ఒక ధార్మిక చింతన గల ముస్లిమ్. అతనే బతఖ్ మియా అన్సారీ అని చాలా మందికి తెలియదు. తెలుగులో చరిత్రకారులు సయ్యద్ నశీర్ అహమద్ పరిశోధన చేసి పుస్తకం తెచ్చేవరకూ ఆ విషయం తెలియలేదు. 1950లో అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈ విషయాన్న బహిర్గతం చేశారని నశీర్ అహమద్ తన పుస్తకంలో రాశారు.

ఖిలాఫత్ ఉద్యమంలో…

గాంధీజీ రాజకీయ ప్రవేశం అనంతరం ఖిలాఫత్ – సహాయ నిరాకరణోద్యమాల్లో గాంధీకీ తోడుగా ముహమ్మద్ అలీ జౌహర్, షౌకరత్ అలీలు అండదండలు అందించారు. అలీ సోదరుల తల్లి ఆబాదీ బానో స్వాతంత్ర్యోద్యమంలో చూపిన చొరవకు ఎంతగానో ఆకర్షితులయ్యారు. ఆమెను అమ్మాజాన్ అని పిలుచుకునేవారు. ఇక ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ తో గాంధీజికి ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సరిహద్దు గాంధీగా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ను పిలిచేవారు. గాంధీజితో అబుల్ కలామ్ ఆజాత్ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. రెహానా తయ్యబ్జీ అనే యోదురాలి దగ్గరే గాంధీజీ ఉర్దూ భాష నేర్చుకున్నారు. హిందూ ముస్లిముల ఐక్యతతోనే దేశాభివృద్ధి సాధ్యమనే ఆకాంక్షించేవారు.

గాంధీజీ ఖుర్ఆన్ చదివేవారు..

మహాత్మా గాంధీకి ఇస్లామ్ ధర్మ బోధనలు అంటే ఎంతో ఇష్టం. తరచుగా ఖుర్ఆన్ పారాయణం చేసేవారు. ఆయనకు ఖుర్ఆన్ లోని సూరె ఫాతిహా కంఠస్తం ఉండేది. గాంధీజీ ముహమ్మద్ ప్రవక్త బోధనలతో ఎంతగానో ప్రేరణ పొందారు. ‘ముహమ్మద్ ప్రవక్త ప్రవచనాల గ్రంథాన్ని నేను ఎంతో ఆసక్తిగా చదువుతానని ఆయన ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. జైలులో ఉన్నన్ని రోజులు భగవద్గీతతో పాటు ఖుర్ఆన్ గ్రంథాన్ని ఎంతో ఆసక్తిగా చదివేవారు. కారాగారంలో తన తోటి సహచర ముస్లిములను నమాజు కోసం మేల్కొలిపేవారని ఉలమాలు తమ ప్రసంగాల్లో గాంధీజీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ప్రతీరోజూ ఆధ్యాత్మిక దినచర్యలో భాగంగా ఉదయాన్నే సూరె ఫాతిహా పఠించేవారని చరిత్రకారులు రాశారు. గాంధీజీ తన సభలు, సమావేశాల్లో తరచుగా ఖుర్ఆన్ పారాయణంతో ప్రారంభించేవారు.

ఇస్లామ్ కత్తితో వ్యాపించలేదు..

‘‘ఆ కాలంలో జీవన రంగాన ఇస్లామ్ కు ఓ స్థానాన్ని అందజేసింది కరవాలం కాదని నాకు మునుపటి కన్నా అధికంగానే నమ్మకం కలుగుతోంది. అది ప్రవక్తలోని ఖచ్చితమైన నిరాడంబరత, అనన్యమయిన నిస్వార్థత, తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పట్ల నిర్ధ్వంధమైన పట్టింపు, తన సన్నిహితుల పట్ల సహచరుల పట్ల ఆయన ప్రగాఢమైన ప్రేమ భావం, ఆయనలోని నిర్భయత, ఆయన కనబరచిన అచంచలమైన దైవ విశ్వాసం, తన ధ్యేయం పట్ల కదిలించనలవికాని నిలకడ, నమ్మకం.’’ అని గాంధీజీ యంగ్ ఇండియాలో రాసుకొచ్చారు. హిందూ ముస్లిముల ప్రేమ, ఐక్యతకోసం ఎంతగానో పరితపించేవారు. ముస్లిములు ఖుర్ఆన్ సూచించే నైతిక సూత్రాలకు అనుగుణంగా జీవించాలని పిలుపునిచ్చేవారు. ‘హజ్రత్ అబూబకర్, హజ్రత్ ఉమర్ లాంటి నిజాయితీ గల పాలన దేశానికి అవసరమని నొక్కిచెప్పేవారు.

– ముహమ్మద్ ముజాహిద్, 9640622076

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles