26.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

అమర్‌నాథ్ యాత్రలో విషాదం… ఆకస్మిక వరదలతో 15మంది జల సమాధి!

శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది.  ఆకస్మికంగా కురిసిన కుండపోత వర్షంతో  పెనువిషాదం సంభవించింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో జమ్ముకశ్మీర్‌లోని అమర్‌నాథ్‌లో ఆకస్మిక వరదలు వచ్చాయి. వరదల కారణంగా 15 మంది మరణించగా, 40 మందికి పైగా యాత్రికులు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి జోరున కురిసిన వర్షంతో అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం ఎగువ ప్రాంతాలు, కొండలపై నుంచి వరద నీరు ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో కింది ప్రాంతంలో ఉన్న గుడారాలు కొట్టుకుపోయాయి. గుడారాల పైకి వరద పోటెత్తింది. దీంతో పలువురు భక్తులు చిక్కుకున్నారు.

దీంతో సైన్యం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను ప్రారంభించింది. గాయపడిన వారిని హెలికాప్టర్ల సాయంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని జమ్మూ కాశ్మీర్ పోలీసు ఐజిపి తెలిపారు. అమర్‌నాథ్ గుహ సమీపంలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో నీరు వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ద్వారా యాత్రికులను సురక్షితంగా తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

అమర్‌నాథ్‌ వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అమర్‌నాథ్‌లో మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా భక్తులు పోటెత్తుతారు. కరోనా కారణంగా 2020, 2021లో యాత్ర జరగలేదు. ఈ ఏడాది జూన్‌ 30న ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటి వరకు లక్ష మంది వరకు భక్తులు మంచు శివ లింగాన్ని దర్శించుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. 43 రోజుల పాటు సాగే ఈ యాత్ర… షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 11తో ముగియాల్సి ఉన్నది. అమర్‌నాథుడిని దర్శించుకోవాలంటే శ్రీనగర్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని పహల్గామ్‌తో పాటు బాల్తా పట్టణాల మీదుగా రెండు రూట్లు ఉంటాయి. ఆయా మార్గాల్లో అధికారులు బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. అక్కడి వరకు వచ్చిన వారిని బ్యాచ్‌ల వారీగా అమరనాథుడి దర్శనానికి పంపించేలా ఏర్పాట్లు చేస్తారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రెండు రోజుల కింద యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వర్షం కొంత తెరిపి ఇవ్వడంతో యాత్రి తిరిగి ప్రారంభమైంది. అయితే, శుక్రవారం మధ్యాహ్నం ఊహించనివిధంగా కుంభవృష్టి కురిసింది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles