28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

‘మన నిఖత్ బంగారం’… కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ!

బర్మింగ్‌హాం: తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్.. కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్‌ ఫ్లై) విభాగంలో నార్తరన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై  5-0 తేడాతో అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది. హాట్ ఫేవరెట్ గా ఈ మెగా ఈవెంట్ లో అడుగుపెట్టిన నిఖత్ జరీన్ అంచనాలకు మించి రాణించింది.

మూడు రౌండ్ల పాటు జరిగిన ఫైనల్ పోరులో నిఖత్ జరీన్… ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆరంభం నుంచే ఐర్లాండ్ ప్రత్యర్థిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. రింగ్‌లో ఒకే చోట నిలబడకుండా అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతూ ముష్టిఘాతాలు కురిపించింది.  లెఫ్ట్‌ హుక్‌, రైట్‌ జాబ్‌ను ఒకేసారి ప్రయోగిస్తూ ప్రత్యర్థిని తికమక పెట్టింది. నిఖత్ జరీన్ పంచ్‌లకు మెక్ నౌల్ కంటికి గాయం కూడా అయ్యింది. ఏ దశలోనూ ఆమె నిఖత్ దూకుడుకు సమాధానం ఇవ్వలేకపోయింది.

ఈ ఏడాది మే 19న జరిగిన ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ కూడా నిఖత్ స్వర్ణం గెలుచుకుంది. కొంతకాలంగా నిఖత్ వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. ఈ సీజన్‌లో ఇది నిఖత్ సాధించిన మూడో గోల్డ్ మెడల్. మేరీ కోమ్ తర్వాత బాక్సింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో దూసుకెళ్తున్న క్రీడాకారిణిగా నిలిచింది నిఖత్ జరీన్.

కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన అనంతరం నిఖత్ జరీన్ మాట్లాడుతూ… కష్టపడి సాధన చేస్తున్నంత కాలం తనను ఎవరూ ఆపలేరని భారత బాక్సింగ్‌ స్టార్‌, తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ స్పష్టంచేసింది. దేశానికి పతకాలు అందిస్తుండటమే తన లక్ష్యమని తెలిపింది.

నిజామాబాద్‌ నుంచి వచ్చిన తాను… ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. తెలంగాణ, హైదరాబాద్‌ నుంచి చాలామంది అత్యుత్తమ క్రీడాకారులు వచ్చారు. సైనా, సింధు, నారంగ్‌, సానియా, మిథాలీ సహా ఎంతోమంది హైదరాబాద్‌ పేరు నిలబెడుతున్నారు. ఆ జాబితాలో నా పేరు కూడా చేరడం గర్వంగా ఉంది. సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో నన్ను అభినందించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, కామన్వెల్త్‌ క్రీడలు వెంటవెంటనే జరిగాయి. విజయాన్ని ఆస్వాదించడానికి.. విశ్రాంతి తీసుకోడానికి సమయం దొరకలేదు. ఇప్పుడు కొంచెం విరామం తీసుకుంటా అని నిఖత్ విజయం సాధించాక పేర్కొంది.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో నిఖత్‌ జరీన్‌ స్వర్ణం గెలవడం పట్ల ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. వీరిరువురు నిఖత్‌ను అభినందనలతో ముంచెత్తారు. నిఖత్‌.. భారత్‌కు గర్వకారణమని, భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని ట్విట్టర్ ద్వారా అభినందించారు.

నిఖత్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌..  నిఖత్‌ గెలుపుతో తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తమైందని వ్యాఖ్యానించారు. దేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేశావని పేర్కొన్నారు. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన నిఖత్‌.. తాజా క్రీడల్లో స్వర్ణంతో సత్తాచాటడం మరింత సంతోషాన్నిచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.   నిఖత్‌.. తన విజయపరంపరను కొనసాగించాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.

నిఖత్ జరీన్ ప్రస్తుతం అనుభవిస్తున్న సక్సెస్ అంత సులభంగా ఏమీ రాలేదు. ప్రతిభ ఉన్నా.. తాను ఎంచుకున్న కేటగిరీలో అప్పటికే  మేరీకామ్ లాంటి దిగ్గజం భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆరంభంలో నిఖత్ కు అవకాశాలు రాలేదు.       మేరీ కామ్ వల్ల ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ కు దూరమైంది. అయితే మేరీ కామ్ పక్కకు తప్పుకోవడంతో ఈ ఏడాది నుంచి నిఖత్ 50 కేజీల విభాగంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. ఈ క్రమంలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో విజేతగా నిలవడంతో పాటు.. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి ఆడుతూనే ఏకంగా  స్వర్ణ పతకం సాధించింది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles