26.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

అదానీ గుప్పిట్లోకి NDTV…. 29 శాతం వాటా కొనుగోలు, మరో 26 శాతానికి ఆఫర్!

న్యూఢిల్లీ:  ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ చానల్‌  ‘న్యూ ఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌’లో (NDTV)  మెజారిటీ వాటాను చేజిక్కించుకోనున్నట్లు మంగళవారం వెల్లడించింది. రుణాలను ఈక్విటీగా మార్పు చేసుకోవడం ద్వారా ఎన్‌డీటీవీలో 29 శాతానికి పైగా వాటాను అదానీ గ్రూప్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు మెజారిటీ వాటాపై కన్నేసింది. బహిరంగ మార్కెట్‌ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది.

ఇందుకు షేరుకి రూ. 294 ధరను నిర్ణయించింది. తద్వారా విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు AMG మీడియా నెట్‌వర్క్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఈ మూడు సంస్థలు  రూ. 4 ముఖ విలువగల  దాదాపు 1.68 కోట్ల NDTV  షేర్లను చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకు రూ. 493 కోట్లు వెచ్చించనుంది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలకంటే ఆఫర్‌ ధర అధికమని ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈలో ఎన్‌డీటీవీ షేరు సోమవారం ముగింపు ధర రూ. 359కాగా.. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం షేరుకి భారీ డిమాండ్‌ నెలకొంది. దీంతో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి (రూ. 18 లాభపడి) రూ. 377 వద్ద ముగిసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఓపెన్‌ ఆఫర్‌ ధర కంటే 28% అధికం.

ఈ ఆఫర్‌ విజయవంతమైతే ఎన్‌డీటీవీలో 55%పైగా వాటాను అదానీ గ్రూప్‌ పొందే వీలుంది.  ఎన్‌డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్‌ రాయ్, రాధికా రాయ్‌లకు సంస్థలో సంయుక్తంగా 32.26% వాటా ఉంది. కాగా.. అదానీ గ్రూప్‌ రూ. 114 కోట్లకు కొనుగోలు చేసిన వీసీపీఎల్‌ గతంలో ముకేశ్‌ అంబానీ గ్రూప్‌  సంస్థ కావడం కొసమెరుపు!

వివిధ ప్లాట్ ఫామ్ లపై సరికొత్త మీడియా ప్రయాణానికి ఏఎంఎన్ఎల్ పూనుకొన్న తరుణంలో ఇదొక గణనీయమైన మైలురాయని ఏఎంజీ మీడియా సీఈఓ సంజయ్ పుగాలియా అభివర్ణించారు. భారత ప్రజలు , కన్స్యూమర్లు, సమాచారాన్ని తెలుసుకోగోరే వ్యక్తులను దృష్టిలో నుంచుకొని వారికి సాధికారతను కల్పించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఎన్డీటీవీ అన్నది అమూల్యమైన ప్రసార డిజిటల్ ప్లాట్ ఫామ్ అని, ఒక విజన్ తో ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. న్యూస్ ను అందించడంలో ఎన్డీటీవీ లీడర్ షిప్ ని మరింత బలోపేతం చేస్తామన్నారు.

ఎన్‌డీటీవీ దేశంలో ప్రముఖ మీడియా కంపెనీ. మూడు జాతీయ వార్తా ఛానల్స్‌ను ఇది నడుపుతోంది. ఎన్‌డీటీవీ 24×7, ఎన్‌డీటీవీ ఇండియా, ఎన్‌డీటీవీ ప్రాఫిట్ దీనికి చెందినవే. ఈ మీడియా ఛానల్‌కు బలమైన ఆన్‌లైన్ నెట్‌వర్క్ ఉంది. సోషల్ మీడియాలో పలు రకాల ప్లాట్‌ఫామ్స్‌పై ఈ మీడియా ఛానల్‌కు 3.5 కోట్లకు మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కువ మంది ఫాలో అయ్యే న్యూస్ ఛానల్స్‌లో ఇది ఒకటి. ఎన్‌డీటీవీ కంపెనీ రూ.123 కోట్ల ఈబీఐటీడీఏతో రూ.421 కోట్ల రెవెన్యూలను రికార్డు చేసింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ మీడియా ఛానల్ నికర లాభం రూ.85 కోట్లుగా ఉంది.

అదానీకి వాటాలను విక్రయించం : ఎన్‌డిటివి ప్రమోటర్లు
న్యూఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌ (ఎన్‌డిటివి)లో ఆర్‌ఆర్‌పిఆర్‌ హోల్డింగ్‌ ప్రయివేటు లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌పిఆర్‌హెచ్‌)కు ఉన్న వాటాలను విశ్వప్రదాన్‌ ప్రయివేటు లిమిటెడ్‌ (విసిపిఎల్‌)కు బదిలీ చేయాలని వచ్చిన నోటీసులపై ఎన్‌డిటివి ఘాటుగా స్పందించింది. తమతో ఎలాంటి సంప్రదింపులు, చర్చలు లేకుండానే ఈ నోటీసులు ఇవ్వడం దారుణమని పేర్కొంది. తమ సంస్థలు వాటాలు విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఎన్‌డిటివి ఎప్పుడూ తన కీలక కార్యకలాపాల నిర్వహణలో వెనక్కి తగ్గదని స్పష్టం చేసింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles