30.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

బీజేపీని చూసి భయపడొద్దు… టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ అభయం!

హైదరాబాద్‌: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ నేతలపై ఇటీవల జరుగుతున్న ఈడీ, ఐటీ, సీబీఐ దాడులపై  మంత్రులు, పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంయమనం పాటించాలని, అసలు వాటిని పట్టించుకోవద్దని,  బీజేపీ చేసే ఆరాచాకాలపై వారి వారి అసెంబ్లీ సెగ్మెంట్‌లలో బహిరంగ చర్చలు మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. బీజేపీ నుంచి వచ్చే ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవద్దని పార్టీ నేతలకు సీఎం సూచించారు.

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలను సీబీఐ గురువారం ఢిల్లీకి పిలిపించి విచారించింది. మంత్రి, ఎంపీలకు చెందిన గ్రానైట్‌ కంపెనీల జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు నమోదైంది. ఇటీవల మనీలాండరింగ్‌ కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌ రమణలను కూడా ప్రశ్నించారు. మరికొంత మంది టీఆర్‌ఎస్ నేతలు కూడా రానున్న రోజుల్లో ప్రశ్నించే అవకాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో బీజేపీ చేసే కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలని, నిరుత్సాహ ప‌డ‌వ‌ద్ద‌ని కేసీఆర్ పార్టీ నేత‌ల‌ను కోరారు.” ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మున్ముందు బీజేపీ  ఇంకా చాలా దారుణంగా వ్యవహరించే అవకాశముందని” సీఎం కేసీఆర్ నేతలకు ఉద్భోదించారు. ఈ సవాలును ఎదుర్కొని ప్రజల విశ్వాసాన్ని చూరగొని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే దీనికి పరిష్కారమని సీఎం వారితో అన్నారు.

డిసెంబరు రెండో వారం నుంచి జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసినట్లు సీనియర్ నేత ఒకరు తెలిపారు. జిల్లా స్థాయి అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకావడంతో పాటు, బీజేపీపై తాను తలపెట్టిన బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించి, కాషాయ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసిన తీరు,  రాష్ట్రానికి నిధులు రాకుండా చేసిన తీరును బయటపెట్టేందుకు ఉద్యుక్తులవుతున్నారు.

టీఆర్‌ఎస్ అధినేత,  సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనల సందర్భంగా అన్ని జిల్లాల నేతలతో సంభాషించి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచి, రాష్ట్రంలో  మళ్లీ తమ పార్టీని అధికారంలోకి వచ్చేలా టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles