28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

మైనార్టీ విద్యార్థులకు ఇచ్చే ఎంఏఎన్‌ఎఫ్‌ ఫెలోషిప్ రద్దు… ‌కేంద్రం తీరుపై విద్యార్థుల ఆగ్రహం!

హైదరాబాద్: మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ (MANF)ను  రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2019-20లో 1,251 మందికి ఈ ఫెలోషిప్‌ అందజేయగా, 2020-21 నాటికి 1,075 మందికి కుదించింది. ఇచ్చే నిధులను కూడా రూ.100 కోట్ల నుంచి రూ.74 కోట్లకు తగ్గించింది. ఇప్పుడు ఏకంగా ఆ ఫెలోషిప్‌నే ఎత్తేసింది.

బీజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్రంలోని విద్యార్థి సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తముతోంది. ఈ ఫెలోషిప్ పథకాన్ని రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మైనారిటీలకు ఉన్నత విద్య అభ్యసించే అవకాశాన్ని దూరం చేస్తోందని విద్యార్థులు వాపోయారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ (MANUU)కు చెందిన పలు విద్యార్థి సంఘాలు తమ తమ యూనివర్సిటీ క్యాంపస్‌లలో నిరసనలు చేపట్టాయి.

గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ సమాధానమిస్తూ, ఉన్నత విద్య కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక ఇతర ఫెలోషిప్ పథకాల పరిథిలోకి మైనారిటీ విద్యార్థులు వచ్చారు. దీంతో మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ పథకంతో పెద్దగా ప్రయోజనం ఉండదని, అందుకనే   ప్రభుత్వం 2022-23 నుండి MANF పథకాన్ని నిలిపివేయాలని నిర్ణయించిందని మంత్రి లోక్‌సభలో ప్రకటించారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలోని యూనివర్శిటీలకు నిధులను తగ్గించి ప్రభుత్వ యూనివర్సిటీ వ్యవస్థను నాశనం చేస్తోందని యూఓహెచ్ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి గోపి స్వామి ఆరోపించారు. ఇప్పుడు ఎంఏఎన్‌ఎఫ్‌ను ఆపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మైనారిటీలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షను తుంగలో తొక్కిందని అన్నారు.

మనూ (MANUU) స్టూడెంట్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అబుహంజా మాట్లాడుతూ యూనియన్ ప్రభుత్వం సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ గురించి మాట్లాడుతుందని, అయితే MANF ను రద్దు చేయడం ద్వారా, అది ఉన్నత విద్యలో ప్రవేశించాలనుకునే మైనారిటీల ఆకాంక్షలను అణిచివేస్తోందని అన్నారు.

ఆర్థిక సహాయం లేకుండా మైనారిటీ వర్గాల విద్యార్థులు ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను ఎలా అభ్యసిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “MANF పథకాన్ని కొనసాగించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము,” అన్నారాయన.

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ (MANF) పథకం 2009లో మైనారిటీ కమ్యూనిటీలు – ముస్లింలు, బౌద్ధులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు మరియు సిక్కులు ఎంఫిల్, పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లను కొనసాగించేందుకు ఐదేళ్ల పాటు ఆర్థిక సహాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles