30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

మంత్రి కేటీఆర్, అక్బరుద్దీన్ ఒవైసీ భేటీ… పాతబస్తీ సమస్యలపై చర్చ!

హైదరాబాద్:  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పాతబస్తీ సమస్యలపై మంత్రి కేటీఆర్, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీల మధ్య వాడి వేడి చర్చ నడిచింది. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఇది రెండు రోజులకే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో ఏఐఎంఐఎం (AIMIM) ఎమ్మెల్యేల సమావేశం ఆరు గంటల పాటు జరిగింది.

భేటీ తరువాత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ… మంత్రి కేటీఆర్‌తో చర్చలు ఫలించాయని అన్నారు.  అనేక పనులకు ఉత్తర్వులు ఇచ్చారని,  ఇకనుంచి అభివృద్ధి పనులు చేపట్టడంలో పాత, కొత్త హైదరాబాద్ అనే తేడా ఉండదని భావిస్తున్నామని పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ  అన్నారు.

బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్  మాట్లాడుతూ … జీఎస్డీపీ సహా అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పాతబస్తీలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో పలు అభివృద్ధి పనులపై చర్చించామని, పలు ప్రాజెక్టులు మంజూరు చేశారన్నారు. రానున్న కాలంలో పాతబస్తీ రూపురేఖలు సరికొత్తగా మారనున్నాయని ఆయన అన్నారు.

పాతబస్తీలో మెట్రో కారిడార్ పనులు ప్రారంభించాలని, నోటరీ చేసిన పత్రాలను రిజిస్టర్డ్ ప్రాపర్టీలుగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం పాతబస్తీలో పర్యటించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును కోరారు. ఎంఐఎం ప్రాతినిథ్యంతోనే చారిత్రక లాల్ దర్వాజ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం తెలిపి రూ.20 కోట్లు మంజూరు చేసిందని, అయినా తదుపరి పనులు చేపట్టలేదని అక్బరుద్దీన్ అన్నారు.

అన్ని వర్గాల కోసం మా తలుపులు తెరిచి ఉన్నాయని, వారి హక్కుల కోసం పోరాడుతామని అక్బరుద్దీన్ అన్నారు.  కల్యాణలక్ష్మి పథకానికి రూ.150 కోట్ల నిధులు విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సంబంధించి గత రెండేళ్లుగా 63,128 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. ఇక  మైనారిటీలకు సబ్సిడీ రుణాల కోసం 2లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, దీనికోసం రూ. 200 కోట్లు కేటాయించాలని ఒవైసీ ఆర్థిక మంత్రిని అభ్యర్థించారు. తద్వారా కనీసం 30,000 దరఖాస్తులను పరిష్కరించే అవకాశముందని ఆయన తెలిపారు.

వక్ఫ్‌ బోర్డు, రికార్డు గదికి సీలింగ్‌ వేయాలని తాను నిరంతరం లేవనెత్తుతున్నానని.. వక్ఫ్‌ బోర్డులో అవకతవకలు జరిగాయని, ఇప్పటికీ రికార్డు గదికి సీల్‌ వేసే ఉందని ఒవైసీ అన్నారు. “రికార్డు గదిని తెరిచి, వక్ఫ్ ఆస్తులపై ఆడిట్ నిర్వహించి, పత్రాలను డిజిటలైజ్ చేయాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను” అని ఆయన తెలిపారు.

అక్బరుద్దీన్ ఒవైసీ నిరుద్యోగ సమస్యను కూడా లేవనెత్తారు. “అర్హత ఉన్న నిరుద్యోగ యువత అందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించలేదని ఆయన విమర్శించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు వీరందరికి నెలకు మూడువేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.  అయితే ప్రస్తుత బడ్జెట్‌లో దాని ప్రస్తావన లేదు,” అని ఆయన అన్నారు.

“నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం కోసం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌తో… మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో కలిసి పనిచేయాలని నేను అభ్యర్థించాను. ఇప్పటికైనా మించిపోయిందేమీలేదు.  ఓల్డ్ సిటీలోని యువతకు ఎన్ఏసీ (NAC) ద్వారా శిక్షణ ఇవ్వండి.” ఇక ఉస్మానియా ఆసుపత్రి, చార్మినార్ యునానీ ఆసుపత్రి, కళాశాలలను పునరుద్ధరించాలని, మక్కా మసీదు పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles