32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

ఏపీలో మంత్రులందరూ నేడు రాజీనామా… 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం!

అమరావతి: వైకాపా ప్రభుత్వానికి సంబంధించిన రెండో కేబినెట్ త్వరలోనే కొలువు దీరనుంది. దీంతో మొదటి కేబినెట్ చిట్టచివరి  సమావేశం ఇవాళ జరుగనుంది. ఈ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులంతా రాజీనామాలు సమర్పించనున్నారు. మంత్రిమండలిలోని మొత్తం 25 మంది మంత్రుల నుంచి సీఎం జగన్‌ రాజీనామాలు తీసుకోనున్నారు. ప్రస్తుత మంత్రిమండలి చివరి సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో జరగనుంది. మంత్రిమండలి సమావేశ ఎజెండాను కూడా సిద్ధం చేశారు. ఈ సమావేశంలోనే మంత్రుల రాజీనామాను సీఎం కోరే అవకాశం ఉంది. తర్వాత ప్రక్రియను ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రమాణ స్వీకారం రోజే మంత్రులంతా రెండున్నరేళ్ల వరకే కొనసాగుతారని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినందున ఈ మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపై కసరత్తు పూర్తి చేసిన సీఎం… గవర్నర్‌ను కలిసి సమగ్రంగా చర్చించారు. ఈ నెల 11న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్ ను కోరారు.

అయితే 25 మందీ కొత్తవారే ఉంటారా? లేదా ప్రస్తుత మంత్రుల్లో కొంతమంది కూడా అందులో ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులలో ముగ్గురు లేదా నలుగురు 11న మళ్లీ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలిసింది. కుల సమీకరణాల రీత్యా ప్రస్తుత కేబినెట్ లోని కొందరు మంత్రులు కొత్త కేబినెట్ లోనూ కొనసాగే అవకాశాలున్నట్టు సమాచారం. కొత్త మంత్రులు ఎవరన్న విషయాన్ని ఈ నెల 9 లేదా 10 ఉదయం వరకు గోప్యంగానే ఉంచే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

చిట్టచివరి కేబినెట్ సమావేశంలో రాజీనామాల అంశంతో పాటు ముఖ్యమంత్రితో కలసి పనిచేసిన అనుభవాలను, నవరత్నాల అమలు తీరుపైనా మంత్రులు మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు జర్నలిస్టులకు ఇంటి స్థలం కేటాయించే అంశంతో పాటు మరికొన్ని సంస్థలకు భూకేటాయింపులపైనా చర్చించే అవకాశముంది. నెల్లూరులో పెన్నా నదిపై నిర్మించిన సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును పెట్టే ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదాన్ని తెలియచేయనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న కొన్ని నిర్ణయాలనూ సమీక్ష చేయనున్నారు. ఇక మరో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన అంశంపైనా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ లో మార్పు చేర్పులకు సంబంధించి ఇప్పటికే దిల్లీ పెద్దలకు , గవర్నర్​కు.. సీఎం జగన్ సమాచారం ఇచ్చివచ్చారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles