30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

టర్కీ, సిరియాలో 16 వేలు దాటిన మృతులు… సహాయ శిబిరాలను సందర్శించిన టర్కీ అధ్యక్షుడు!

అంకారా :  టర్కీ, సిరియాల్లో అకస్మాత్తుగా సంభవించిన  భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది.  రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 16వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.  శిథిలాలను తొలగించే కొద్ది శవాలు వెలుగుచూస్తున్నాయి.   భవన శకలాల కింద  వేలమంది సాయం కోసం మౌనంగా వేచి చూస్తున్నారు.  భవనాల శిథిలాల నుంచి రోజూ బయటపడుతున్న వందల శవాలు కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి.

బాధితులకు సంఘీభావం తెలిపేందుకు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌ సహాయ శిబిరాలను సందర్శించారు. ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తడంతో ఎర్డోగాన్ అత్యంత కష్టతరమైన ప్రదేశాలలో ఒకటైన భూకంప కేంద్రం కహ్రామన్‌మారాస్‌ను సందర్శించి అక్కడ సమస్యలను పరిష్కరించారు. లోటుపాట్లు ఉన్నాయని ఒప్పుకున్నారు.. ఇలాంటి విపత్తుకు సిద్ధంగా ఉండటం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

గత దశాబ్ధ కాలంలో సంభవించిన విపత్తుల్లో ఇంతగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇది ఇప్పటికే ఈ శతాబ్దంలో అత్యంత ఘోరమైన భూకంపాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు.  మరణాల సంఖ్య గంట గంటకూ పెరుగుతూనే ఉంది. సోమవారం నాటి 7.8 తీవ్రతతో సంభవించిన ప్రకంపనల కారణంగా టర్కీలో 12,873 మంది, సిరియాలో కనీసం 3,162 మంది మరణించారని, మొత్తం 16 వేలకు చేరుకుందని అధికారులు, వైద్యులు తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని నిపుణులు భయపడుతున్నారు.

స్థానిక రెస్క్యూ సిబ్బందితో పాటు 20 దేశాల నుంచి టర్కీకి వెళ్లిన అత్యవసర బృందాలు తమ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. భూకంప ప్రభావిత జోన్‌లో  చలిని లెక్క చేయకుండా.. మంచుకురుస్తున్నా ప్రస్తుతం 60 వేలకు పైగా సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు అందిస్తున్నారు.

కాగా, బ్రస్సెల్స్‌లో ఈయూ సిరియా, టర్కీలకు అంతర్జాతీయ సహాయాన్ని సమీకరించడానికి మార్చిలో దాతల సమావేశాన్ని ప్లాన్ చేస్తోంది. అందరూ కలిసి జీవితాలను రక్షించేందుకు పని చేస్తున్నామని ఈయూ చీఫ్‌ ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

భూకంప ప్రభావిత సిరియాలో…  ఓ చిన్నారి తన సోదరుడిని కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని అడ్డంపెట్టింది. గంట, రెండు గంటలు కాదు.. ఏకంగా 30 గంటలకుపైగా తన చేతిని అడ్డంగా పెట్టి సోదరుడిని కాపాడుకుంది. ఈ సాహసోపేత వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈయూ సహాయం కోసం సిరియా విజ్ఞప్తి

భూకం ధాటికి అల్లాడుతున్న సిరియా సహాయం కోసం ఈయూకి అధికారిక అభ్యర్ధన చేసింది.  దశాబ్ద కాలంగా కొనసాగుతున్న అంతర్యుద్ధం సిరియా ఆసుపత్రులను నాశనం చేసింది, ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చింది  విద్యుత్, ఇంధనం, నీటి కొరతతో అల్లాడుతోంది.

వైద్య సామాగ్రి, ఆహారం కోసం సిరియా చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందించాలని  ఈయూ సభ్య దేశాలను యూరోపియన్ కమిషన్ “ప్రోత్సహిస్తోంది”, అయితే అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వం ద్వారా ఏదైనా సహాయం “పక్కదారి పట్టకుండా” పర్యవేక్షణ జరగాలని బ్లాక్ కమీషనర్ లెనార్సిక్ పేర్కొన్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles