30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర… నేడు ఎమ్మెల్యేలతో భేటీకి కేజ్రీవాల్ పిలుపు!

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ కీలక సమావేశం గురువారం జరగనున్న సమయంలో ఆ పార్టీకి చెందిన కొందరు  ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి అందుబాటులో లేనట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని ఆరోపణలు వచ్చిన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

బీజేపీలో చేరితే తమకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నేతలు తమకు ఆఫర్ ఇచ్చారని నలుగురు ఆప్ ఎమ్మెల్యేలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యేల సమావేశం నేడు జరుగుతోంది.

ఆప్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం కొందరు ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి అందుబాటులో లేరు. ఇదిలావుండగా, ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) బుధవారం సమావేశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ఖండిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. కోట్లాది రూపాయలు ఆశ చూపించి, తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై బూటకపు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, ఆయనపై సీబీఐ రైడ్‌కు ఆదేశించడాన్ని తమకు అసంతృప్తికి గురిచేసిందని  ఆప్ పీఏసీ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మరో 14 మందిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మనీష్ సిసోడియాపై ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ తన విశ్వాసాన్ని ప్రకటించింది.  సిబిఐ దాడిలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏమీ కనుగొనలేకపోయిందని ఆప్ పీఏసీ సభ్యుడు సంజయ్ సింగ్ పేర్కొన్నారు.

రాజకీయ వ్యవహారాల కమిటీ  (PAC) యొక్క తీర్మానాన్ని ప్రస్తావిస్తూ సంజయ్ సింగ్ ఇలా అన్నారు… “తనపై ఉన్న అన్ని కేసులను మూసివేయాలంటే ఆప్‌ (AAP) నుండి BJPకి ఫిరాయించాలని బిజెపి డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాకు బీజేపీ సందేశం పంపింది; ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆయనకు సీఎం పదవిని ఆఫర్ చేసింది. అయితే ఈ ఆఫర్‌ను మనీష్ సిసోడియా తిరస్కరించిన తర్వాత, బిజెపి పలువురు ఆప్ ఎమ్మెల్యేలను సంప్రదించి, 20 కోట్ల నగదు తీసుకుని బిజెపిలో చేరాలని, లేకుంటే డిప్యూటీ సిఎం లాగా వేధింపులు, అరెస్టులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించిందని సంజయ్ సింగ్ అన్నారు.

పీఏసీ సమావేశం అనంతరం సంజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ..  “రాజ్యాంగ విరుద్ధంగా, అవినీతి పద్ధతిలో ఢిల్లీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బిజెపి చాలా ఆసక్తిగా ఉంది. ప్రభుత్వం సుస్థిరంగా ఉందని, ఏ ఎమ్మెల్యే కూడా ఆప్‌ని వీడరని ఢిల్లీ ప్రజలకు భరోసా ఇవ్వాలని ఆప్ పీఏసీ కోరుతోంది’’ అని పీఏసీ తీర్మానంలో పేర్కొంది.

‘డబ్బులు ఇచ్చి గూండాయిజానికి పాల్పడుతూ బీజేపీ దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలను కూల్చివేస్తున్నందుకు మేము నిరాశ చెందాము. ఇదే విషయాన్ని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసి, రాజకీయ నేతల తర్వాత సీబీఐ, ఈడీలను పంపే బదులు ప్రజల సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

“ప్రజలు నేడు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో బాధపడుతుంటే… మీరేమో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలను అస్థిరపరచడానికి మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు వెచ్చిస్తున్న కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, అంత డబ్బు ఎలా పోగుపడిందో దేశ ప్రజలకు తెలపాలని ఆయన బీజేపీని కోరారు.

దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని  సంజయ్ సింగ్ ఆరోపించారు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిందే విషయంలో బీజేపీ చేసిన ప్రయోగం సక్సెస్‌ అయినప్పటికీ, ఢిల్లీలో మనీశ్‌ సిసోడియా విషయంలో ఆ ప్రయోగం విఫలమైందన్నారు.

దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని తెలిపారు. ఇది చాలా తీవ్రమైన అంశమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దీనిపై చర్చించేందుకు గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవ్వాలని నిర్ణయించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలిపింది

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles