30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

కేంద్ర బడ్జెట్…. మైనారిటీ పథకాల నిధుల్లో 38% కోత!

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఈసారి భారీగా నిధులు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే సుమారు 38శాతం కోత పెట్టారు. మైనారిటీ పథకాలకు 2022-23 బడ్జెట్‌లో రూ5020.50కోట్లు కేటాయించగా, ఈసారి రూ.3097.60 కోట్లు ప్రతిపాదించారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అని నినదిస్తూ ఇలా మైనారిటీ పథకాలకు నిధులు తగ్గించడం  ద్వారా కేంద్రంలోని బీజేపీ… మైనారిటీలను సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అణిచివేయనుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మైనారిటీ కమ్యూనిటీ విద్యార్థులకు ఏటా ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులకు ఇచ్చే మెరిట్-కమ్ మీన్స్ స్కాలర్‌షిప్‌తో సహా స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లకు పెద్ద నిధుల కోత విధించారు. ఈ పథకాలకు ఈ ఏడాది ₹44 కోట్ల నిధులు కేటాయించగా, గతేడాది బడ్జెట్ ₹365 కోట్లుగా ఉంది. 2022-23లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బడ్జెట్ అంచనా ₹5,020.50 కోట్లు. ఈసారి మంత్రిత్వ శాఖకు ₹3,097 కోట్లు కేటాయించారు.

2022-23లో మంత్రిత్వ శాఖకు సవరించిన నిధుల కేటాయింపు ₹2,612.66 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మైనారిటీల ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం ₹900 కోట్లతో నిధులను ఆర్థిక మంత్రిత్వ శాఖ తగ్గించింది. గత బడ్జెట్‌లో స్కాలర్‌షిప్ నిధులు ₹1,425 కోట్లు, ఈ ఏడాది ₹433 కోట్లకు తగ్గించారు. అయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం నిధులు ₹515 కోట్ల నుంచి ₹1,065 కోట్లకు పెంచారు.

అదేవిధంగా, యూనియన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్‌లు నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలకు మైనారిటీ అభ్యర్థులకు సన్నద్ధం కావడానికి ఉద్దేశించిన నయీ ఉడాన్ పథకం కూడా రద్దు చేశారు. ఉన్నత విద్య కోసం మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ కూడా గతేడాది డిసెంబర్‌లోనే రద్దు చేశారు 2023-24 బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ లైవ్లీహుడ్స్ కింద 2022-23లో ₹ 491.91 కోట్ల బడ్జెట్‌ను 2023-24లో కేవలం ₹ 64.40 కోట్లకు తగ్గించింది.

అదేవిధంగా, మైనారిటీల కోసం ఉచిత కోచింగ్, అనుబంధ పథకాలు కూడా ఈ సంవత్సరం బడ్జెట్‌లో 60% కోత విధించారు. వీటికి గతేడాది 79 కోట్లు నిధులివ్వగా… ఈ ఏడాది 30 కోట్లు మాత్రమే  కేటాయించారు. మైనారిటీల విద్యా సాధికారత కోసం బడ్జెట్‌లో గత ఏడాది ₹2,515 కోట్లు. అయితే  ఈ ఏడాది  అది రూ. 1,689 కోట్లకు తగ్గింది.

నయి మంజిల్, USTAD వంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఈసారి కేవలం ₹10 లక్షల బడ్జెట్ మాత్రమే ఇచ్చారు. , అదే గత సంవత్సరం  ఇది రూ. 235 కోట్లు,  రూ. 7 కోట్లుగా ఉంది.  మైనారిటీల పరిశోధన పథకాల బడ్జెట్‌ను  తగ్గించారు. వివిధ నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి పథకాల కోసం 2022-23లో ₹491 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం  ₹64.40 కోట్లు మాత్రమే కేటాయించారు.

మద్రసాలు,  మైనారిటీల కోసం ఉద్దేశించిన విద్యా పథకానికి నిధుల్లో 93%  కోత పెట్టారు.   2023-24 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ. 10 కోట్లు మాత్రమే కేటాయించారు. 2022-23 బడ్జెట్ కేటాయింపు ₹160 కోట్లు.

మైనార్టీల కోసం ఉద్దేశించిన ప్రత్యేక పథకాల్లో దాదాపు 50% కోత విధించారు. ఇందులో పరిశోధన, అధ్యయనాలు, ప్రచారం, మైనారిటీల కోసం అభివృద్ధి పథకాల పర్యవేక్షణ,మూల్యాంకనం, మైనారిటీల వారసత్వ పరిరక్షణ, మైనారిటీల జనాభా క్షీణతను నియంత్రించే పథకాలు ఉన్నాయి.

ప్రధాన్ మంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ (PMJVK) కూడా నిధుల కోతకు గురయింది. గత ఏడాది దీని బడ్జెట్ రూ.1,650 కోట్లుగా ఉంది, ఈ సంవత్సరం రూ.. 600 కోట్లకు తగ్గించారు. ఈ పథకాన్ని మైనారిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో  ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, జాతీయ సగటుతో పోల్చితే అసమతుల్యతలను తగ్గించడానికి, మైనారిటీల సామాజిక-ఆర్థిక మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సౌకర్యాలను అభివృద్ధి చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం”

ప్రధాన్ మంత్రి జన్ వికాస్ కార్యక్రమ్ (PMJVK) కింద సెన్సస్ 2011 డేటా ఆధారంగా, 33 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 870 మైనారిటీ బ్లాక్‌లు (MCBలు), 321 మైనారిటీ  పట్టణాలు (MCTలు),109 మైనారిటీ ఏకాగ్రత జిల్లాల HQలు (MCD HQలు) గుర్తించారు. ఇప్పుడు నిధుల్లో కోత విధించడంతో ఈ మైనారిటీ ప్రాంతాల అభివృద్ధి డోలాయమానంలో పడింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles