32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

రాష్ట్రంలో గిడ్డంగుల సామర్థ్యం తొమ్మిదేళ్లలో రెట్టింపు!

వరంగల్‌: గత తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర గిడ్డంగుల సామర్థ్యాన్ని 36 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 74 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిధులతో నిర్మించిన 10 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల నూతన గోడౌన్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు.

గోడౌన్‌ను ప్రారంభించడంతో పాటు ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెక్కులను అందజేశారు.

సభను ఉద్దేశించి మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువను పెంచడంలో రైతు బంధు పథకం విజయవంతమైందన్నారు.

ఈ పథకం ప్రభావాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించిందని కూడా ఆయన పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం యాంత్రీకరణను పెంచుతోందన్నారు.

రాష్ట్రంలో అనేక మారుమూల ప్రాంతాల్లో సాగునీరు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపడ్డాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గాలివానతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన ప్రకటించారు.

అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు రూ.10,000 నష్టపరిహారం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని ఎర్రబెల్లి దయాకర్ రావు ఉద్ఘాటించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్య, తదితరులు హాజరయ్యారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles