30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

మన ఊరు–మన బడి…1,000కి పైగా ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ!

హైదరాబాద్:   రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక పథకం ‘మన ఊరు-మన బడి’. ఈ కార్యక్రమంలో భాగంగా రానున్న విద్యాసంవత్సరంలో 1,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించారు. వీటిని త్వరలో ప్రారంభించనున్నారు. దీంతో  విద్యార్థులు తమ కొత్త విద్యా సంవత్సరాన్ని సరి కొత్త స్కూల్ వాతావరణంలో ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో 700కి పైగా పునరుద్దరించిన పాఠశాలలను ప్రారంభించగా, జూన్ 2న ప్రారంభం కానున్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 1,000 పాఠశాలలను సంబంధిత ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు. ఈ  పాఠశాలలు బోధన, మౌలిక సదుపాయాల పరంగా కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా ఉంటాయి.

అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం 26,072 సర్కారు బడుల్లో దశలవారీగా 12రకాల మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి పూనుకుంది.  మొదటి దశగా రూ. 3,497.62 కోట్ల అంచనా వ్యయంతో పనుల కోసం 9,123 పాఠశాలలను ఎంపిక చేసింది.

రన్నింగ్ వాటర్ సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, ఫర్నీచర్, మొత్తం పాఠశాలలకు పెయింటింగ్, గ్రీన్ చాక్‌బోర్డ్, శిథిలావస్థలో ఉన్న వాటి స్థానంలో కొత్త తరగతి గదులు ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు వంటి పలు మౌలికసౌకర్యాలు కల్పిస్తున్నారు.

ప్రభుత్వం డిజిటల్ విద్యను అందించడంపై దృష్టి పెట్టింది. ఉన్నత పాఠశాలలకు మినీ-కంప్యూటర్‌లుగా పనిచేసే 13,983 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లు అందించారు.

బోధన, ఆడియో-వీడియో కంటెంట్ స్క్రీనింగ్ కోసం సాధారణ బ్లాక్ బోర్డ్‌గా ఉపయోగించడమే కాకుండా, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్‌లను సబ్జెక్ట్ నిపుణులతో ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ సెషన్‌ల కోసం కూడా ఉపయోగించవచ్చు. అలాగే, 20,000 టాబ్లెట్ PCలు పాఠశాలలకు అందించారు.  ఇవి రాబోయే విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల విద్యా పనితీరును ట్రాక్ చేయడంతో పాటు విద్యార్థులు,  ఉపాధ్యాయుల హాజరును గుర్తించడానికి ఉపయోగించనున్నారు.

పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సోలార్ ఫోటోవోల్టాయిక్ పవర్ ప్లాంట్‌లతో మొత్తం 1,521 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు పవర్ హౌస్‌లుగా మారాయి. డిజిటల్ బోధనను సులభతరం చేయడానికి టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌తో కలిసి పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.  2,000 పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles