32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

ఓయూ ఆర్ట్స్ కాలేజీకి పూర్వ వైభవం తెచ్చేలా పునరుద్ధరణ పనులు!

హైదరాబాద్: ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి పూర్వ వైభవం తెచ్చేలా  యూనివర్సిటీ  పాలకవర్గం పునరుద్ధరణ పనులు చేపట్టింది. దీంతో చారిత్రాత్మకమైన ఆర్ట్స్ కళాశాల తన అందాలను తిరిగి పొందనుంది.

భవన నిర్మాణాన్ని మార్చకుండా రూఫ్ టాప్ నుండి నీరు కారడాన్ని ఆపేందుకు వాటర్‌ఫ్రూఫింగ్ సిస్టమ్‌ ఏర్పాటు చేయనుంది. అదేసమయంలో అందమైన గ్రానైట్ రాయితో నిర్మించిన భవనానికి తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు పాలకమండలి విస్తృతమైన ప్రణాళికలను రూపొందించింది. వర్షపు నీటి లీకేజీ కారణంగా 84 ఏళ్ల చారిత్రక భవనం  బయటి, లోపలి గోడలకు అనేక చోట్ల తడిగా కనిపించడమే కాకుండా పగుళ్లు కూడా ఏర్పడ్డాయి.

వర్షపు నీటి లీకేజీని ఆపడానికి టెర్రస్‌పై 1998, 2008లో వేసిన అటాక్టిక్ పాలీప్రొఫైలిన్ (APP) మెమ్బ్రేన్ షీట్‌ల మీద ఇప్పుడు కొత్త వాటర్‌ఫ్రూఫింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.  ఇది భవనం లోపలి భాగంలో లీకేజీని నివారిస్తుంది.

డ్రెయిన్ రంధ్రాలను సరిచేసి.. వర్షపునీరంతా కిందకు వచ్చేలా చేస్తారు. అదేసమయంలో పైకప్పు వాటర్‌ఫ్రూఫింగ్ మెటీరియల్, సోలార్ రిఫ్లెక్టివ్ పెయింట్‌కు లోబడి ఉంటుంది. దీనిని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సరైన మెయింటనెన్స్ చేస్తే  రాబోయే నాలుగు దశాబ్దాల వరకు ఢోకా ఉండదు.

“ఆర్ట్స్ కాలేజీ భవనంలో ప్రధాన సమస్య రూఫ్ టాప్ నుండి వర్షపు నీరు లీకేజీ. దీంతో భవనంలోకి నీరు చేరకుండా చూసేందుకు పనులు ప్రారంభించారు. ఆ తర్వాత ఇంటీరియర్‌ బ్యూటిఫికేషన్‌ పనులు ప్రారంభిస్తాం’’ అని ఓయూ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌  అన్నారు.

ఉస్మానియ విశ్వవిద్యాలయం 1918లో గన్‌ఫౌండ్రీ నుండి తన కార్యకలాపాలను ప్రారంభించగా, ఆర్ట్స్ కాలేజీకి జూలై 5, 1934న శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 4, 1939న ప్రారంభించారు. ఈ భవన నిర్మాణం అజంతా  స్తంభం, లింటెల్ శైలి మేళవింపుతో ఉంటుంది.   తోరణాలు ఇండో-సార్సెనిక్ సంప్రదాయానికి చెందినవి.

పాడైపోయిన వాటర్ ఫౌంటెయిన్, విరిగిన కిటికీ అద్దాలను పునరుద్ధరించడమే కాకుండా, విశ్వవిద్యాలయం కళాశాల భవనం ముఖద్వారం వద్ద షాన్డిలియర్‌ను మళ్లీ బిగించనున్నారు. కళాశాలలోని అన్ని టాయిలెట్లను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టారు.

ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చే ప్రయత్నంలో ఇటీవల డైనమిక్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఇంకా, వర్సిటీ ద్వారా త్వరలో లేజర్, సౌండ్ షో ప్రారంభించనున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles