30.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

ప్రైవేట్ స్కూళ్లలో ఆకాశాన్నంటిన పాఠ్యపుస్తకాల ధరలు!

హైదరాబాద్: ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల జేబుకు చిల్లుపడటం ఖాయంగా కన్పిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పాఠ్యపుస్తకాల ధర కనీసం 50 శాతం ఎక్కువ పెరిగింది.  పాఠ్యపుస్తకాల ధరలు పెరగడానికి ప్రధాన కారణాలలో పేపర్ ధర భారీగా పెరగడం కూడా ఒకటి.

గతేడాది మెట్రిక్ టన్ను పేపర్ ధర రూ.61వేలు ఉండగా, ఈ ఏడాది రూ.95వేలకు పెరిగింది. దీంతో పాఠ్యపుస్తకాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఉదాహరణగా చెప్పాలంటే, పదో తరగతికి సంబంధించి ఎనిమిది పాఠ్యపుస్తకాల సెట్‌ ఈ ఏడాది రూ.1,074 ఉండగా, గత విద్యాసంవత్సరం అదే పాఠ్యపుస్తకాల ధర రూ.686గా ఉంది. అదేవిధంగా, IV తరగతికి సంబంధించిన ఐదు పాఠ్యపుస్తకాల ధర గతేడాది రూ.224 ఉండగా ఈ ఏడాది రూ.402గా ఉంది.

రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం మొత్తం 1.22 కోట్ల కాంపోనెంట్ పాఠ్యపుస్తకాలు అవసరం. ఈ పాఠ్యపుస్తకాలు సోమవారం నుంచి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయని ఓ అధికారి తెలిపారు.

ఇదిలా ఉండగా, జూన్ 22 నాటికి 67,87,210 ఉచిత కాంపోనెంట్ పాఠ్యపుస్తకాలను పాఠశాల విద్యా శాఖకు చెందిన ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణాలయం జిల్లాలకు పంపింది. ఈ పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టడంతో ద్విభాషా పాఠ్యపుస్తకాలు అంటే ఆంగ్లం, తెలుగులో ముద్రించారు. ఉదాహరణకు, తెలుగు మీడియంలోని ప్రతి పాఠం పేజీ పక్కనున్న పేజీలో ఆంగ్ల పాఠం ఉంటుంది. అదేవిధంగా హిందీ, ఉర్దూ మీడియం విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.

పేజీల సంఖ్య పెరిగేకొద్దీ, పుస్తకం బరువు కూడా పెరుగుతుంది. సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA) I మరియు II కోసం రెండు భాగాలుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో SA-I పాఠ్యపుస్తకాల పంపిణీ జరుగుతోంది, అయితే SA-II పాఠ్యపుస్తకాలు ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో అందిస్తారు.

“ఈ నెలాఖరులోగా 70 శాతం, జూలై 15 నాటికి 100 శాతం ఉచిత కాంపోనెంట్ పాఠ్యపుస్తకాల పంపిణీని పూర్తి చేస్తాం. పేపర్ ధరల పెరుగుదల కారణంగా, ఉచిత కాంపోనెంట్ పాఠ్యపుస్తకాల బడ్జెట్ గత ఏడాది 60 కోట్ల రూపాయల నుండి రెట్టింపు అయ్యింది. ఇప్పుడు రూ. 120 కోట్లకు చేరుకుంది’’ అని ఓ విద్యాశాఖా అధికారి వివరించారు. ఈ సంవత్సరం, అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలు క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్‌లతో ముద్రిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఈ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా, విద్యార్థులు పాఠాలను వీక్షించవచ్చు, స్వయంగా నేర్చుకోవచ్చు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles