32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్‌ సాధిస్తారు….టీఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుంది… కేటీఆర్!

హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి  హ్యాట్రిక్ సాధిస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.  ద్వంద్వ ప్రమాణాలు  తప్పుడు ప్రచారాలు చేస్తున్న బిజెపి నాయకులకు కూడా చురకలంటించారు.

కేటీఆర్ నిన్న ట్విట్టర్‌ వేది‌కగా ‘ఆస్క్‌ కేటీ‌ఆర్‌’ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిం‌చారు. రాజకీయాలు, పాలన, ఇతర విషయాలతో సహా పలు అంశాలపై రెండు గంటల పాటు నెటి‌జన్లు అడి‌గిన ప్రశ్న‌లకు ఓపిగ్గా సమా‌ధా‌న‌మి‌చ్చారు.

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో తమ డిస్‌ప్లే పిక్చర్ (డిపి)ని మార్చుకోవాలని ప్రజలను కోరినందుకు.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. “డిపి బదల్నే సే క్యా హోగా? జీడీపీ బదల్నే సే దేశ్ ఆగే బడేగా. (డిపిని మార్చడం వల్ల ఉపయోగం ఏమిటి? జిడిపిని మార్చడం ద్వారా దేశం పురోగమిస్తుంది”) అని కేటీఆర్  అన్నారు.

‘ఉచితాలు’ ఆపాలని, కార్పొరేట్ రుణాలను మొండి రుణాలుగా మాఫీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన వ్యాఖ్యలపై మంత్రి మాట్లాడుతూ…  పేద‌లకు అందించే ఉచిత పథ‌కా‌లపై సరైన దృక్పథం, ప్రాధాన్యం ఉంటే మంచి‌దని, కానీ ప్రధాని మోదీ పేద‌లకు సాయం చేయటం మాని.. కార్పొ‌రేట్‌ సంస్థ‌లకు రూ.12 లక్షల కోట్ల రుణ‌మాఫీ చేశా‌రని మండి‌ప‌డ్డారు. ఇదే మోదీ స్టైల్‌ అని ఎద్దేవా చేశారు. విపక్ష ప్రభు‌త్వా‌లను కూల్చటం మాని, పడి‌పో‌తున్న రూపా‌యిపై దృష్టి సారిం‌చా‌లని ప్రధాని మోదీకి హితవు పలికారు.

ప్రధాని హైద‌రా‌బాద్‌ వస్తే ప్రొటో‌కాల్‌ పాటిం‌చ‌లే‌దని ఓ నెటిజన్ అడగ్గా.. అన‌ధి‌కా‌రిక కార్య‌క్ర‌మాల కోసం ప్రధాని రాష్ట్రాల్లో పర్య‌టిస్తే ముఖ్య‌మంత్రి స్వాగతం చెప్పా‌ల్సిన అవ‌సరం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీకి చెందిన ఒక జర్నలిస్ట్ ఇంగ్లీషులో ఇదే ప్రశ్న వేసి, హిందీలో సమాధానం చెప్పమని కోరినప్పుడు, “మా పైన హిందీ రుద్దడం ఇష్టం లేదు” అని బదులిచ్చారు.

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై, ఆమె ప్రసంగంపై జరిగిన ‘భారత వ్యతిరేక’ నిరసనలపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని బీజేపీ మద్దతుదారు డిమాండ్ చేయగా, నూపుర్ శర్మ వ్యాఖ్యలు  సిగ్గుచేటని, తద్వారా ప్రపంచ దేశాలముందు తలదించుకోవాల్సి వచ్చిందని,  అలాంటి వారికి మద్దతివ్వడం మరింత సిగ్గుచేటని కేటీఆర్ అన్నారు.

జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో జిఎస్‌టిని పెంచకుండా కేంద్రాన్ని తెలంగాణ ఎందుకు అడ్డుకోలేదని ఓ నెటిజన్ కేటీఆర్‌ను ప్రశ్నించగా… జీఎస్టీ కౌన్సి‌ల్‌లో బీజే‌పీకి ఉన్న మంద‌బ‌లంతో ప్ర‌జ‌ల‌పై భారీగా పన్నులు పెంచు‌తు‌న్న‌దని, రాష్ట్రాలు వ్యతి‌రే‌కిం‌చినా కేంద్రం పట్టిం‌చు‌కో‌వడం లేదని విమ‌ర్శిం‌చారు. దేశంలో ఉన్న ప్ర‌భుత్వ‌ రంగ సంస్థ‌ల‌న్నిం‌టినీ ప్రైవేటీక‌రించ‌టంతో రైతులు, ఇతర వర్గాల పయో‌జ‌నాలు త్రీవంగా దెబ్బ‌తిం‌టా‌యని కేటీఆర్ ఆందో‌ళన వ్యక్తం చేశారు.

బీజేపీ జాతీ‌య‌వాదం, మత‌వా‌దంతో ఎన్ని‌కల్లో గెలి‌చేం‌దుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌న్న‌ ప్రశ్నకు.. మాది అభి‌వృ‌ద్ధి‌పూ‌ర్వక జాతీ‌య‌వా‌ద‌మని, దాని‌పైనే తాము దృష్టి‌సా‌రి‌స్తా‌మని తేల్చి చెప్పారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి మారిన నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నికలపై వ్యాఖ్యానిస్తూ.. ఇది మరో ఉప ఎన్నిక మాత్రమేనని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని ఆయన అన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్ని‌కల్లో టీడీపీ లేదా కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా? అని ఓ నెటి‌జన్‌ ప్రశ్నిం‌చగా.. తమ పొత్తు తెలం‌గాణ ప్ర‌జ‌ల‌తోనే ఉంటుం‌దని కేటీ‌ఆర్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది వివిధ నియో‌జ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్ని‌కలు వస్తా‌యన్న బండి సంజయ్ ప్ర‌కట‌న‌పై.. ముంగేరి లాల్‌కి హసీన్‌ స్వప్నే అంటూ కేటీ‌ఆర్‌ జోక్‌ చేశారు.  బండి సంజయ్‌ స్వయంగా ఇంగ్లి‌ష్‌లో ట్వీట్‌ చేస్తు‌న్నారా? అని ఓ నెటి‌జన్‌ ప్రశ్న వేయగా.. ఆ విషయం నువ్వే చెప్పా‌లని చమ‌త్క‌రిం‌చారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles