28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

శీతాకాలంలో లాంగ్ డ్రైవ్‌కు వెళదాం… ఉల్లాసంగా-ఉత్సాహంగా ఉందాం!

హైదరాబాద్: శీతాకాలం అంటే ఎవరికైనా ముసుగుతన్ని పడుకోవాలనిపిస్తుంది. త్వరగా నిద్రలేవాలనిపించదు. అయితే కొన్ని అందమైన ప్రదేశాలు శీతాకాలంలో చూస్తేనే వాటిని ఆస్వాదించగలం. ఈ వానాకాలమంతా హైదరాబాదీలు తడిసి ముద్దయ్యారు. ఎడ తెరిపిలేని వర్షాల కారణంగా సుమారు మూడు నెలలపాటు కనీసం వారాంతాల్లో సరదాగా ఏ పార్కుకో, షాపింగ్ మాల్‌కు కూడా వెళ్లలేక పోయారు. పెద్దలు, పిల్లలు అందరూ ఇళ్లలో బందీలయ్యారు. ఇప్పుడు శీతాకాలం వచ్చింది. అందుకే వాన తగ్గగానే పక్షులు రెక్కలల్లార్చుకుంటూ ఎగిరినట్టు…  ఈ సమయంలో లాంగ్ డ్రైవ్‌కు వెళితే ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ఈ శీతాకాలమంతా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల వెంబడి పచ్చదనం, పొగమంచుతో కూడిన రోడ్‌వేలు, సుందరమైన దృశ్యాలు శీతాకాలంలో మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వారమంతా పనిచేసి అలసిన మనకు సాంత్వన కలిగిస్తాయి. ఒక రోజులోనే ఆయా పర్యాటక స్థలాలను దర్శించి, రాత్రికి నగరానికి చేరుకోవచ్చు.

నాగార్జున సాగర్ డ్యామ్ హైదరాబాద్ సమీపంలో ఒక రోజు పర్యటనకు సరైన ప్రదేశాలలో ఒకటి. ఆనకట్ట  వీక్షణ మనసు తేలికవుతుంది.  ఇక అక్కడి కుగ్రామాలు మనల్ని చూపుతిప్పుకోనివ్వవు. నాగార్జున సాగర్ నుండి ఒక గంటకు పైగా ప్రయాణం మిమ్మల్ని చాలాకాలంగా మరచిపోయిన యెల్లేశ్వరగట్టు ద్వీపానికి తీసుకువెళుతుంది.

నాగార్జునసాగర్ డ్యాం పనుల కోసం 60 సంవత్సరాల క్రితం విశాఖపట్నం నుండి రెండు డజన్ల కుటుంబాలు ఇక్కడకు వలస వచ్చాయి. నేడు వారు 700 మందికి పైగా సభ్యులతో ఒక గ్రామాన్ని నిర్మించారు. దానికి వైజాగ్ కాలనీ అని పేరు పెట్టారు. ఈ ప్రదేశం చుట్టూ కొండలు, నీటిపారుదల భూములు, ఒకవైపు నాగార్జున సాగర్ రిజర్వాయర్,  మరోవైపు బ్యాక్ వాటర్స్ ఉన్నాయి.  వాహనాలను పార్క్ చేయడానికి ఒడ్డున విశాలమైన స్థలం అందుబాటులో ఉంది.

ఆదిలాబాద్ ప్రకృతి సోయగం చూసి తీరాల్సిందే…

ఈ జిల్లాలో జలపాతాలు… అభయారణ్యాలు… దేవాలయాల వంటి అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. మొత్తం రోడ్ డ్రైవ్ కొండలు, దట్టమైన అడవులు, పచ్చని వృక్షసంపద గుండా వెళుతుంటే ఎంతో సుందరంగా ఉంటుంది. ఆదిలాబాద్‌లో కొన్ని స్థానిక వంటకాలను తప్పకుండా రుచి చూడాల్సిందే.

తెలంగాణ ప్రకృతి సిరి… అనంతగిరి!

ఇంకా హైదరాబాద్‌ దగ్గరలో ప్రకృతి ఒడిలో విహరించాలనుకుంటే… హైదరాబాద్-అనంతగిరి హిల్స్ రోడ్ ట్రిప్ కోసం తప్పనిసరిగా బయలుదేరాలి. రోడ్డు పొడవునా ఇరువైపులా పచ్చని చెట్లతో అలరారుతుంది. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునేవాళ్లు ఇక్కడికి వస్తే శరీరం ఉత్తేజ కరంగా మారుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎత్తయిన కొండలు, పచ్చటి హరిత వనాలు, ఇరుకైన లోయలు, అలరించే మయూరాలు, స్వచ్ఛమైన గాలి, సహజ సిద్ధంగా ఏర్పడిన మంచినీటి బుగ్గలు ఇలా ఎన్నో ప్రకృతి అందాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి.

పక్షుల కిలకిల రావాలు… కుందేళ్ల పరుగులు… నెమళ్ల సోయగాలు.. పచ్చని పంటపొలాలతో కోటపల్లి ప్రాజెక్టు కళకళలాడుతుంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. కోటపల్లి రిజర్వాయర్‌లో బోటింగ్ సదుపాయం కూడా ఉంది.

వీటితో పాటు కొండపోచమ్మ సాగర్ జలాశయం, శామీర్‌పేట్, గండిపేట్ సరస్సు, రాచకొండ కోట, నగరానికి 113 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖిల్లా ఘన్‌పూర్ వద్దకు వెళ్లడం వల్ల మనసుకు ఎంతో హాయి కలుగుతుంది.

అయితే, శీతాకాలంలో  రోడ్ ట్రిప్‌ను ప్రారంభించే ముందు మన వాహానాన్ని ముందే సంసిద్ధం చేసుకోవాలి.   లైట్లను చెక్ చేయాలి.  టైర్లలో గాలి సరిచూసుకోవాలి. వైపర్ బ్లేడ్‌లను తనిఖీ చేసుకోవాలి. ఎమర్జెన్సీ కిట్‌ సంసిద్ధంగా ఉంచుకోవాలి. మొత్తంగా  వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసుకుంటే మేలు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles