30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు… డిసెంబర్ 6న విచారణ!

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో  సీఏం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సిబిఐ అధికారులు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేశారు.  ఈ స్కామ్‌లో కవిత పాత్రపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంస్థలు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమెను విచారించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ మేరకు  దర్యాప్తు అధికారి అలోక్‌ కుమార్‌ షాహి కవితకు నోటీసులు జారీ చేశారు. 6వ తేదీన (వచ్చే మంగళవారం) విచారిస్తామని అందులో పేర్కొన్నారు.

ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ ఇచ్చిన రాత పూర్వక పిర్యాదు ఆధారంగా  నమోదు చేసిన కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను విచారణకు పిలిచినట్లు నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు.. మరో 14 మందిపై నమోదు చేసినట్లు నోటీసులో తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి విచారణకు హాజరు కావాలన్నారు.

మద్యం పాలసీ కేసుకు సంబంధించి వ్యాపారవేత్త అమిత్ అరోరా రిమాండ్ కోసం ఢిల్లీ కోర్టులో ఈడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరు గురువారం వెలుగులోకి వచ్చింది. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వ్యాపారవేత్త విజయ్ నాయర్, ‘సౌత్ గ్రూప్’ అనే సంస్థ నుండి ‘ఆప్’ నాయకుల తరపున 100 కోట్ల రూపాయల కిక్‌బ్యాక్‌లు అందుకున్నారు. ఈ బృందాన్ని శరత్ రెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రించారు.

ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా డైరెక్టర్లలో ఒకరైన శరత్ రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి)కి చెందిన పార్లమెంటు సభ్యుడు.

ఇదిలా ఉండగా, అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తన పేరును చేర్చడంపై స్పందించిన కవిత.. ఇదంతా బీజేపీ కుట్రగా ఆరోపించారు. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లల్లో.. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలో వచ్చిందని విమర్శించిన విషయం తెలిసిందే.  కాగా.. ఈనెల 6వ తేదీన హైదరాబాద్ లోని తన ఇంటివద్దే సీబీఐ అధికారులకు తన వివరణ ఇస్తానని కవిత చెప్పినట్లు తెలుస్తోంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles