28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

హైదరాబాద్‌లో ‘గోల్డ్’ ఏటీఎమ్‌ ఏర్పాటు… దేశంలోనే ఇది మొదటిది!

హైదరాబాద్:  దేశంలోనే తొలిసారిగా మెట్రోసిటీ హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎం ఏర్పాటైంది. గోల్డ్‌ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో ఈ ఏటీఎంను శనివారం రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ ఏటీఎంల ద్వారా డెబిట్, క్రెడిట్‌ కార్డు సహాయంతో బంగారం విత్‌డ్రా చేసుకోవచ్చు. హైదరాబాద్ ఆధారిత స్టార్టప్, ఓపెన్‌క్యూబ్ టెక్నాలజీస్ సాంకేతిక సాయంతో గోల్డ్‌సిక్కా బేగంపేటలో తన మొదటి గోల్డ్ ATMని ప్రారంభించింది.

ఈ గోల్ట్ ఏటీఎం ద్వారా 99.99శాతం క్వాలిటీ కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు విత్ డ్రా చేసుకోవచ్చని గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్‌ తరుజ్‌ వెల్లడించారు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్‌ కార్డులతో పాటు, మేము జారీ చేసే ప్రీపెయిడ్‌ కార్డులనూ ఉపయోగించుకోవచ్చ’ని తెలిపారు నాణేల నాణ్యత, గ్యారెంటీ తెలిపే పత్రాలు కూడా జారీ అవుతాయని వివరించారు.  త్వరలోనే నగరంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు…. వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్‌పై డిస్ ప్లే అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో గోల్డ్‌ ఏటీఎం ప్రారంభించడం సంతోషకరమైన విషయమన్నారు. టెక్నాలజీ పరంగా దేశంలోనే హైదరాబాద్‌ మొదటి స్థానంలో కొనసాగుతోందన్నారు. తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది చాలా ఉపయోగం అవుతుందని ఆమె అన్నారు.

హైదరాబాద్‌లోని విమానాశ్రయం, పాతబస్తీలో మూడు యంత్రాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.  రానున్న రెండేళ్లలో భారతదేశం అంతటా 3,000 యంత్రాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తరుజ్ తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్, సునీత లక్ష్మా రెడ్డి, గోల్డ్‌సిక్కా చైర్‌పర్సన్ అంబికా బర్మన్, ఓపెన్‌క్యూబ్ టెక్నాలజీస్ సీఈవో పి. వినోద్ కుమార్, టి-హబ్ సీఈవో ఎం. శ్రీనివాసరావు  పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles